హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఖమ్మం వెలుగుమట్లలో మంత్రుల బినామీల ప్రయోజనాల కోసం 1,000 మంది పేదల ఇండ్లను కూలగొట్టడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల ఇండ్ల పకనే ఉన్న కాంగ్రెస్ మంత్రుల విల్లాలకు వ్యూ అడ్డం వస్తుందనే కారణంతో, ముగ్గురు మంత్రుల బినామీలైన వేజెళ్ల సురేశ్, ముల్లా కిశోర్, దామోదర్‌రావుల రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ఈ విధ్వంసం సృష్టించారని విమర్శించారు.
ఒక శత్రు దేశంపై దండయాత్రకు వెళ్లినట్టు 3,000 మంది పోలీసులతో తెల్లవారుజామున వచ్చి, ఆడబిడ్డలు వేడుకుంటున్నా కనికరించకుండా ఇండ్లను నేలమట్టం చేయడం అమానుషమని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ బినామీల కోసం పేదలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితుల తరఫున బీఆర్ఎస్ ఉద్యమించడంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని ఇప్పుడు బాధితులకు ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని తెలిపారు. ఇండ్లు కూల్చిన ప్రాంతంలో కాకుండా మరోచోట పేదలకు స్థలాలు ఇస్తామంటున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పేదలకు చెందిన భూములను లాకుంటూ రియల్ ఎస్టేట్ మాఫియాలా పనిచేస్తున్నదని మండిపడ్డారు. జిల్లాల్లో, హైదరాబాద్‌లో సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా విలేజ్ పేరుతో పేదల భూములను లాకొన్నదని విమర్శించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల ఇండ్లను కూలగొట్టిందని, రామగుండంలో దాడికి పాల్పడిందని గుర్తుచేశారు.
తెలంగాణలో నాడు వినోబాభావే తలపెట్టిన భూదానోద్యమ స్ఫూర్తితో 1950వ దశకంలో ఇద్దరు పెద్దలు 62 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారని, అందులో 31 ఎకరాలను గతంలోనే కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని కేటీఆర్ ఆరోపించారు. మిగిలిన భూమిలో చట్టబద్ధంగా పట్టాలు పొంది, పదేండ్లుగా నివసిస్తున్న పేదల ఇండ్లను ఇప్పుడు కూల్చివేయడం ప్రభుత్వ వినాశకర ఆలోచనకు నిదర్శనమని విమర్శించారు.
ఇష్టంగా కట్టుకున్న ఇండ్లను కండ్లముందే కూల్చేస్తుంటే రోదిస్తున్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులని మంత్రులు అవమానిస్తారా? అని ప్రశ్నించారు. అసలైన పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వ సొమ్మును పందికొకుల్లా దోచుకుంటున్న వారేనని మండిపడ్డారు. తక్షణమే బాధితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెయ్యి మంది ఇండ్లను కూలగొట్టి, ఇప్పుడు కేవలం 310 మందికి 75 గజాల చొప్పున పట్టాలివ్వడం ద్వారా మిగిలిన భూమిని ఎవరు నొక్కేస్తున్నారని నిలదీశారు. గతంలో 100 గజాల పట్టా ఉన్న వారికి ఇప్పుడు తకువ (50 గజాలు) భూమి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఇండ్లు కూల్చేసిన సర్కారే ఇండ్లు కట్టిస్తాననడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
అసలు సరార్ నడుపుతున్నారా? లేక సరస్ నడుపుతున్నారా? అని ఎద్దేవా చేశారు. పేదలను బజారున పడేసి, కనీసం దుస్తులు మార్చుకునేందుకు చాటు, నిలువ నీడలేకుండా చేసిన కాంగ్రెస్ నేతలు.. అక్కడి ఏసీపీ చేత బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కొందరిపై పీడీ యాక్ట్ పెట్టి వేధించేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగుమట్లతోపాటు ప్రభుత్వం లాక్కున్న అన్ని భూములపై, ఇండ్ల కూల్చివేతలపై విచారణ జరిపిస్తామని, నిందితులపై చర్యలు చేపడుతామని హెచ్చరించారు.
బాధితులకు భోజనం పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మీడియాకు తమ బాధలు చెప్తున్న బాధితులను కూడా పోలీసులు ఎత్తుకెళ్లిపోతున్నారని ఆరోపించారు. తక్షణమే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని, పోలీసులు తమ దాష్టీకాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఇష్టపడి కట్టుకున్న ఇండ్లను ఎకడైతే కూలగొట్టారో అకడే తిరిగి పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించి ఇవ్వాలని, ఆస్తి నష్టానికి గానూ ఒకో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల తక్షణ నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. చెరువు శిఖం భూముల్లో విల్లాలు కట్టుకున్న మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇండ్లను ముందు కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, జోగు రామన్న, ఎమ్మెల్సీ తాతా మధు, విప్ వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కర్నె ప్రభాకర్, రాగిడి లక్ష్మారెడ్డి, తలసాని సాయికిరణ్‌యాదవ్ పాల్గొన్నారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదల ఇండ్లు కూల్చి రోడ్డున పడేశారు. ఆ దారుణం జరిగిన రోజే నేను తీవ్రం గా ఖండించాను. ప్రభుత్వం చేసింది తప్పు అని నాడు ఘంటాపథంగా చెప్పా. నేను చెప్పింది వాస్తవమని ఈరోజు తేలిపోయింది.
– కేటీఆర్
వెలుగుమట్ల పేదల భూముల పకనే కాంగ్రెస్ మంత్రుల విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాలకు వ్యూ అడ్డు వస్తుందనే కారణంతో పేదల ఇండ్లను కూల్చారు. మంత్రుల బినామీలైన సురేశ్, కిశోర్, దామోదర్‌రావుకు చెందిన రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ఈ విధ్వంసం సృష్టించారు.
-కేటీఆర్