ముంబై: దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్-2026 తొలిదశ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే ఈనెల 28 నుంచి టోర్నీ మొదలవనుంది.
డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య బెంగళూరు వేదికగా జరుగబోయే మ్యాచ్‌తో 2026 సీజన్ ఆరంభమవనుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 దాకా జరుగనున్న తొలి దశ షెడ్యూల్లో పది జట్లు.. నాలుగేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మొదటి దఫా షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ.. ఎన్నికల తేదీ వచ్చాక పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశముంది.
ఐపీఎల్లో తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవనుంది. 2016లో బెంగళూరును ఓడించి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హైదరాబాద్.. 2017లో ఆర్సీబీతో ఫస్ట్ మ్యాచ్‌ను ఆడింది. ఆ తర్వాత ఈ రెండు జట్లు టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. సీజన్ తొలి మ్యాచ్ ఆడనుండటం ఎస్ఆర్హెచ్కు ఇది రెండోసారి కాగా ఆర్సీబీకి ఏడోసారి కావడం విశేషం.
ఇదిలాఉండగా బెంగళూరులోనే మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ తెలిపినా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మైదానంలో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈనెల 13న కమిటీ.. చిన్నస్వామిని సందర్శించి ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది.
16 రోజుల పాటు జరిగే ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్లో ఆయా జట్లు.. తమ ప్రత్యర్థులతో నాలుగు మ్యాచ్‌లు ఆడతాయి. అయితే ఈసారి పది జట్లను రెండు గ్రూపులుగా విభజించడంపైనా స్పష్టత లేదు. ప్రతి సీజన్లో పది జట్లు రెండేసి గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడుతాయన్న విషయం విదితమే. మొదటి 20 మ్యాచ్‌ల్లో భాగంగా నాలుగు డబుల్ హెడర్లు జరుగనున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైన రెండో వారం మొదటి శనివారం (ఏప్రిల్ 4న) ఢిల్లీ, ముంబై మధ్యాహ్నం మ్యాచ్ ఆడనుండగా గుజరాత్, రాజస్థాన్ అహ్మదాబాద్‌లో రాత్రి తలపడతాయి. ఏప్రిల్ 5, 11, 12వ తేదీల్లో డబుల్ హెడర్లు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు మొదలవుతాయి.
సీజన్ ప్రారంభ మ్యాచ్ ఆడబోయే సన్‌రైజర్స్.. ఈ దశలో సొంతమైదానంలో ఒక్కటంటే ఒకటే మ్యాచ్ ఆడుతుంది. ఏప్రిల్ 5 మధ్యాహ్నం.. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ స్టేడియం మోతెక్కనుంది.
