న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపు కోరుతూ విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం లోక్‌సభలో వీగిపోయింది. సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ అనంతరం సభ వాయిదా పడింది. లోక్‌సభ గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశమవుతుంది. నిష్పాక్షికంగా సభను నిర్వహించడంలో స్పీకర్ ఓం బిర్లా విఫలమయ్యారని ఆరోపిస్తూ విపక్షం ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గురువారం సభలో ఓం బిర్లా స్పీకర్ స్థానంలో ఆసీనులవుతారు. విపక్ష సభ్యుల ప్రవర్తనపై ఆయన సభలో ఓ ప్రకటన చేయనున్నారు.
పార్లమెంట్లో అసమ్మతికి స్థానం తగ్గిపోతున్నదని పేర్కొన్న విపక్ష సభ్యులు అధికార పక్షం పట్ల స్పీకర్ పక్షపాత వైఖరిని ఖండించేందుకే తాము ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. స్పీకర్ నుంచి తమకు తగినంత రక్షణ లభించడం లేదని విపక్ష సభ్యులు తరచు భావిస్తున్నట్లు ఆర్జేడీ ఎంపీ అభయ్ కుమార్ సిన్హా చర్చ సందర్భంగా లోక్‌సభలో తెలిపారు. సభ స్వతంత్రతకు స్పీకర్ ప్రాతినిధ్యం వహించడం లేదని, ఆయన అధికార పార్టీ దౌర్జన్యానికి చిహ్నంగా మారిపోయారని సిన్హా ఆరోపించారు.
ఒకే రోజు 140 మందికిపైగా ఎంపీలను సస్పెండ్ చేసిన రోజున కూడా సభ బ్లాక్ డే చూసిందని, తమ గొంతు కూడా వినాలని పేదలు, బలహీనులు భావించిన రోజే నిజమైన ప్రజాస్వామ్యమని ఆయన చెప్పారు. విపక్ష ఎంపీలు సభలో మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతి సారీ స్పీకర్ నుంచి వద్దు.. వద్దు.. వద్దు అన్న మాటలే పదేపదే వస్తాయని ఆయన చెప్పారు. విపక్ష సభ్యుల ప్రసంగాలకు అడ్డు తగలడం సభలో నిత్యకృత్యంగా మారిపోయిందని జేఎంఎం ఎంపీ విజయ్ కుమార్ హన్స్దక చెప్పారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసినా పార్లమెంట్లో ప్రజాస్వామిక హక్కుల గురించి తమ ఆందోళనపై చర్చించే అవకాశాన్ని తాము కోరుకున్నామని ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ బజరంగ్ అన్నారు.
అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటరీ రాజకీయాల్లో బాధాకర చర్యగా ఆయన అభివర్ణించారు.