Mass layoffs | కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని సంస్థలు (tech industry) తమ ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేసిన విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద కంపెనీలన్న తేడా లేకుండా అన్ని సంస్థలూ ఉగ్యోలకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ ఏడాది కూడా చాలా సంస్థలు లేఆఫ్స్‌ను (Mass layoffs) కొనసాగించాయి. అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా ఎన్నో దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థలూ ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గించుకున్నాయి.
ఇక ఈ ఏడాది ఆగస్టు నెలలోనే పలు సంస్థలు ఏకంగా 27 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఇంటెల్, ఐబీఎం, సిస్కో, డెల్ వంటి టాప్ సంస్థల్లో ఈ లేఆఫ్స్ కొనసాగాయి. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 422 కంపెనీలు సుమారుగా 1,36,000 కంటే ఎక్కువ మందికే ఉద్వాసన పలికాయి.
ఇంటెల్‌లో 15,000 మందికి ఉద్వాసన..
అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ భారీఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ తన ఉద్యోగులకు పంపిన సమాచారంలో ఈ బాధాకరమైన వార్తను తెలిపారు. 2025 నాటికి రూ.83,761 కోట్లు (సుమారుగా) ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీని కోసం ప్రస్తుతం పని చేస్తున్నవారిలో 15 శాతం (అంటే 15,000) మందిని తొలగించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆఫర్‌ను ప్రకటిస్తామన్నారు. ‘రెండో త్రైమాసికం ఫలితాలు నిరాశపరిచాయి. చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలో ఎన్నో మైలురాళ్లను అధిగమించినప్పటికీ.. ఫలితాలు ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. దీంతో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో ఇంకా కఠిన సవాళ్లతో కూడిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని తెలిపారు.
ఇటీవలే ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్ డాలర్ల వరకు నష్టం నమోదు చేసింది. ఇక ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 15 శాతం మందిని తొలగించాలని తాజాగా కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు ఉద్యోగుల్ని తొలగించడం వల్ల ప్రతి సంవత్సరం ఇంటెల్‌కు.. 20 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులు తగ్గుతాయని అంచనా.
డెల్..
డెల్ టెక్నాలజీస్ కూడా గత 15 నెలల్లో రెండవ దశ లేఆఫ్స్‌ను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని అంటే.. ఏకంగా 12,500 మందిని విధుల నుంచి తొలగించింది. ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేశాయి.
కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, భవిష్యత్ వృద్ధికి దారితీసే రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో ఉద్యోగుల సంఖ్యను డెల్ కుదించిందని చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని డెల్ గ్లోబల్ సేల్స్, కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ చానెల్స్ చీఫ్ జాన్ బైర్న్ ఓ మెమో ద్వారా సమాచారం అందించారు. భవిష్యత్ వృద్ధి కోసం ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు.
అదేవిధంగా ప్రపంచంలోని ప్రముఖ నెట్వర్కింగ్ ఈక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ సంస్థల్లో ఒకటైన సిస్కో (Cisco) ఈ ఏడాది రెండో విడత కోతల్లో భాగంగా భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. 5,900 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు సిస్కో సిస్టమ్స్ తెలిపింది. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యలో 7 శాతం మందిపై వేటు వేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 4 వేల మందికి సిస్కో ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. కంపెనీ ప్రధాన వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సరఫరా చైన్‌లో సమస్యల కారణంగానే కంపెనీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జర్మనీ చిప్ మేకర్ సంస్థ ఇన్ఫీయన్ 1400 సిబ్బందిని, ఐబీఎమ్ వెయ్యి మందిని, కెనడియన్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ స్కిప్ ది డిషెసెస్ 800 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి.
ఇక ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ సైతం 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో చాలామంది స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో విధులు నిర్వహిస్తున్న వాళ్లే. భారీ ఖర్చు సహా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టులను యాపిల్ పక్కన పెట్టింది. వీటితోపాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలమంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్ ఏప్రిల్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించింది.
ఇక ఎలాన్‌మస్క్‌కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రపంచ వ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని విధుల నుంచి తొలగించింది. ఇక ఓలా క్యాబ్స్, వర్ల్‌పూల్, టెలినార్, గోప్రో, బ్రేవ్, షేర్‌చాట్ వంటి సంస్థలు సైతం వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి.
Also Read..
Virat Kohli | రూ.66 కోట్ల ట్యాక్స్ చెల్లించిన విరాట్ కోహ్లీ.. మరి ధోనీ ఎంతో తెలుసా..?
Pranitha Subhash | మగబిడ్డకు జన్మనిచ్చిన నటి ప్రణీత.. నెట్టింట శుభాకాంక్షలు వెల్లువ
Air India: మాస్కోలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్