గురువారం 26 నవంబర్ 2020
Business - Jun 15, 2020 , 00:42:02

రెపోరేటుకు మారారా?

రెపోరేటుకు మారారా?

గృహ రుణాలపై బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రెండు రకాలు. వీటిలో ఒకటి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌తో, మరొకటి ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమై ఉంటుంది. రిజర్వు బ్యాంకు రెపోరేటును సవరించిన వెంటనే బ్యాంకులు అదేస్థాయిలో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ రేట్లను మారుస్తాయి. ఈ ప్రభావం.. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌తో రుణాలు తీసుకొన్నవారిపై త్వరగా, ఎంసీఎల్‌ఆర్‌తో రుణాలు తీసుకొన్నవారిపై ఆలస్యంగా పడుతుంది. ప్రస్తుతం రెపోరేటు అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినందున ఈ రెండు రకాల రుణాల్లో ఏది మంచిదో ఓసారి పరిశీలిద్దాం.

కరోనా సంక్షోభం ఎంతోమంది ఆదాయాలను కుంగదీసింది. ఇలాంటి వారంతా బ్యాంకు రుణాలను తీర్చలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల పలుమార్లు కీలక వడ్డీరేట్లను కుదించింది. దీంతో గృహ రుణాలకు సంబంధించిన ఈఎంఐలు (నెలవారీ కిస్తీలు) క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ప్రయోజనాలు రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్ల (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)తో తీసుకొన్న గృహ రుణాలకు త్వరగా బదిలీ అవుతాయి. ఒకవేళ మీరు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) లేదా బేస్‌ లెండింగ్‌ రేటు (బీఎల్‌ఆర్‌)తో రుణం తీసుకొని ఉంటే ఈఎంఐ తగ్గుదల ప్రయోజనాలను పొందేందుకు మరికొంత కాలం ఆగాల్సిందే. తగ్గిన వడ్డీరేట్లు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలకు అమలైనంతగా ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలకు అమలుకాకపోవడమే ఇందుకు కారణం. కనుక స్వల్పకాలికంగానైనా, లేక దీర్ఘకాలికంగానైనా మీకు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ఆధారిత రుణంతోనే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది.

ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ రుణమంటే..

అన్ని రుణాలు బెంచ్‌మార్కు వడ్డీరేటును కలిగి ఉంటాయి. ఇంతకంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలివ్వవు. కానీ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ బెంచ్‌మార్కు రేటు రిజర్వు బ్యాంకు రెపోరేటుతో అనుసంధానమై ఉంటుంది. ఆర్బీఐ రెపోరేటును మార్చిన వెంటనే అదేస్థాయిలో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ రుణ వడ్డీరేట్లు మారుతాయి. రేపోరేటును, బ్యాంకు మార్కప్‌ రేటును కలిపి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌గా లెక్కిస్తారు. రుణగ్రహీత క్రెడిట్‌ ప్రొఫైల్‌ ఆధారంగా బ్యాంకు మరికాస్త మొత్తాన్ని ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు కలిపి తుది వడ్డీరేటును ఖరారు చేస్తుంది.ఉదాహరణకు ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ బ్యాంకు 6.85 శాతం ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ (4 శాతం రెపోరేటు, 2.85 శాతం మార్కప్‌ రేటు)ను, రుణగ్రహీత క్రెడిట్‌ ప్రొఫైల్‌ ఆధారంగా 1 శాతం వడ్డీని విధిస్తున్నదనుకొంటే అప్పుడు ఆ బ్యాంకు ఇచ్చే గృహ రుణంపై వడ్డీ 6.85 నుంచి 7.85 శాతం మేరకు ఉంటుంది. కానీ రిజర్వు బ్యాంకు రెపోరేటును సవరించిన వెంటనే తదనుగుణంగా వాణిజ్య బ్యాంకులు తమ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను మార్చాల్సి ఉంటుంది. రెపోరేటు తగ్గితే ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు కూడా తగ్గుతాయి. కానీ అవి అమల్లోకి వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కనుక ఎంసీఎల్‌ఆర్‌ లేదా బీఎల్‌ఆర్‌తో రుణాలు తీసుకొన్న వారికంటే ఆర్‌ఎల్‌ఎల్‌తో రుణాలు తీసుకొన్నవారికే త్వరగా లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ రెపోరేటు పెరిగితే ఆ వెంటనే ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ఆధారిత గృహ రుణగ్రహీతల ఈఎంఐలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ఆధారిత గృహ రుణాలను బ్యాంకులు మాత్రమే ఇస్తున్నాయి. హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఇలాంటి  రుణాలను ఇవ్వడంలేదు.

ఎంత ఆదా అవుతుందంటే..

ఈ ఏడాది మార్చి ఆరంభం నాటికి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ రుణాలతోపాటు ఎంసీఎల్‌ఆర్‌ రుణాలపై వార్షిక వడ్డీరేటు 8.25 శాతంగా ఉన్నది. ఈ వడ్డీతో ఈశ్వర్‌ అనే వ్యక్తి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌పై రూ.50 లక్షల రుణాన్ని, ప్రసాద్‌ అనే వ్యక్తి ఎంసీఎల్‌ఆర్‌పై రూ.50 లక్షల రుణాన్ని 20 ఏండ్ల కాలపరిమితితో తీసుకొని ఉంటే.. ఒక్కొక్కరు రూ.42,603 చొప్పున ఈఎంఐ, మొత్తం రూ.52.24 లక్షల చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మార్చి నెలాఖర్లో రిజర్వు బ్యాంకు రెపోరేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఈశ్వర్‌ చెల్లించే ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.50 శాతానికి, ఈఎంఐ రూ.40,280కి తగ్గుతుంది. దీంతో అతను చెల్లించే మొత్తం వడ్డీ రూ.46.67 లక్షలకు దిగివస్తుంది. మరోవైపు ఎంసీఎల్‌ఆర్‌తో ప్రసాద్‌ తీసుకొన్న రుణ వడ్డీరేటు కూడా క్రమంగా తగ్గుతుంది. కానీ అందుకు ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. ప్రస్తుతం రెపోరేటు 4 శాతానికి తగ్గి అత్యంత కనిష్ఠస్థాయికి చేరింది. కనుక దీర్ఘకాలంలో రుణభారాన్ని తగ్గించుకొని, అప్పు నుంచి త్వరగా విముక్తి పొందాలంటే రెపోరేటు తక్కువగా ఉన్నప్పుడే సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించడం ఉత్తమం.