జయశంకర్ భూపాలపల్లి, మే 7 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఫొటో ఉన్న టీ షర్ట్ వేసుకున్న పాపానికి కాంగ్రెస్ నాయకులు ఓ ఉపాధి హామీ కూలీని అందరిముందే టీ షర్ట్ విప్పించి అర్ధనగ్నంగా నిలబెట్టారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. అందరిముందే అతని అభిమానాన్ని అవమానించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామంలో ఉపా ధి హామీ పనులు జరుగుతున్నాయి. కూలీ పొన్న లస్మయ్య ధరించిన టీ షర్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఫొటోలు ఉన్నాయి.
ఎన్నికల ప్రచారం కోసం అక్కడికి వచ్చిన మండల కాంగ్రెస్ నాయకుల కన్ను లస్మయ్య టీషర్ట్‌పై పడింది. ఇంకేముంది వెంట నే ఆ టీషర్ట్‌ను విప్పించి అర్ధనగ్నంగా నిలబెట్టారు. ఈ పరిణామానికి అక్కడ ఉన్న కూలీలంతా నివ్వెరపోయారు. ప్రచారం నిర్వహించినంతసేపు లస్మయ్య అర్ధనగ్నంగానే ఉండిపోయాడు. కాంగ్రెస్ నాయకులు వెళ్లిపోయిన తర్వాత లస్మయ్య మళ్లీ అదే టీ షర్టు ధరించి పనిలో నిమగ్నమయ్యాడు. ఈ ఘటనను ఓ కూలీ సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇది చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ ఇంత దారుణమా? అంటూ కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.