Gold Rates | గత మూడు రోజులుగా కొండదిగుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates).. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్లో తులంపై గరిష్ఠంగా రూ.700 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.1,21,580కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.700 పెరిగి రూ.1,11,450గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,730గా, 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.1,11,600గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1.60 లక్షల వద్ద కొనసాగుతోంది.
కాగా, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల దిగువకు పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. మంగళవారం దేశీయంగా తులం బంగారంపై ఏకంగా రూ.4వేలు తగ్గింది. గత రెండు రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ ధర 200 డాలర్లకు పైగా తగ్గడంతో 3,887 డాలర్లకు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరునాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దగ్గరున్న బంగారం నిల్వలు 880 మెట్రిక్ టన్నులకు చేరాయి. గడిచిన ఏడాది కాలంలో 25.45 మెట్రిక్ టన్నులు పెరిగినట్టు మంగళవారం 2025 ఏప్రిల్-సెప్టెంబర్ విదేశీ మారకపు నిల్వల నిర్వహణపై విడుదలైన ఆర్బీఐ అర్ధ వార్షిక నివేదిక తెలియజేసింది. గత ఏడాది సెప్టెంబర్ ఆఖర్లో ఆర్బీఐ వద్ద 854.73 మెట్రిక్ టన్నులుగా ఉన్న పసిడి నిల్వలు.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఇందులో 575.82 మెట్రిక్ టన్నులు దేశీయంగానే ఉండగా, మిగతా వాటిని విదేశాల్లో ఆర్బీఐ నిల్వ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద 290.37 మెట్రిక్ టన్నులుండగా, 13.99 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతంగా ఉన్నది.
Also Read..
Hurricane Melissa | కరీబియన్ ద్వీప దేశాలపై విరుచుకుపడుతున్న హరికేన్ మెలిసా.. ఏడుగురు మృతి
Bishnoi gang | కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు.. పంజాబ్ సింగర్ ఇంటిపై కాల్పులు
Gold Price | మరింత దిగిన పుత్తడి.. రూ.4 వేలు తగ్గిన తులం ధర