హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కాళ్లు వచ్చాయి. క్లాస్ రూముల్లోని కెమెరాలు కారిడార్లకు తరలుతున్నాయి. అది కూడా కీలకమైన వార్షిక పరీక్షల వేళ. ప్రాక్టికల్ పరీక్షల సమయంలో ల్యాబ్‌ల్లో కెమెరాలతో నిఘా పె ట్టిన ఇంటర్‌బోర్డు.. వార్షిక పరీక్షల సమయంలో నిఘాను తొలగించడం అనేక సందేహాలకు తావిస్తున్నది. దీన్ని చూసి అధ్యాపకలోకం నివ్వెరపోతున్నది. సీసీ కెమెరాల నిఘా ఉత్తదేనా? అని ప్రశ్నిస్తున్నది. ఎవరి ప్ర యోజనాల కోసం ఇలా చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిఘా, పర్యవేక్షణ పేరిట జూనియర్ కాలేజీల్లో 14,300 సీసీ కెమెరాలు అమర్చారు. తరగతి గదుల్లోను వీటిని బిగించారు. ఇవన్నీ నాంపల్లిలోని ఇంటర్బోర్డులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి కోసం 1,495 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్షిక పరీక్షల సందర్భంగా 8 సీసీ కెమెరాలతో మాత్రమే పర్యవేక్షిస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు వెల్లడించారు. మొన్నటికి మొన్న ప్రాక్టికల్స్ సందర్భంగా ల్యాబ్‌ల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరిపారు. ఇది సత్ఫలితాలనిచ్చింది. అక్రమాలను ప్రోత్సహించారన్న నెపంతో 83మంది ఎగ్జామినర్లను విధుల నుంచి తొలగించారు. 5 సెంటర్లను రద్దుచేశారు. అత్యంత కీలకమైన థియరీ పరీక్షల్లో మాత్రం నిఘాను ఉపసంహరించారు.
8 కెమెరాల్లో ఒక కెమెరా సీఎస్‌డీవో గదిలో ఉండనుండగా, మిగతా వాటిని గేట్ దగ్గర, కారిడార్స్‌లో, సెంటర్ వెనుక వైపు ప్రహరీల దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ప్రాక్టికల్స్ సమయంలో ల్యాబ్‌ల్లో సీసీ కెమెరాలుండగా, థియరీ పరీక్షల సమయంలో ఎగ్జామ్ హాల్స్ (గదుల్లో) ఎందుకు తొలగిస్తున్నారని లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. ఎవరి లాభం కోసం ఇలా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. కొందరు అధికారులు కనీస వసతులు చెక్ చేయకుండా ప్రైవేట్ కాలేజీల్లో ఇష్టారీతిన సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని లెక్చరర్లు కోరుతున్నారు.