హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రాథమిక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల విధుల నుంచి పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్(టీజీహెచ్ఎంఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజభాను చంద్రప్రకాశ్, హేమచంద్రుడు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రాష్ట్ర సర్కార్ మార్చి మొదటి వారంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీని, నెలాఖరుకల్లా ఎఫ్ఏ4 పరీక్షలను పూర్తి చేయాల్సి ఉన్నదని, అందులో పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారికి నిరంతర శిక్షణ అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు రెండ్రోజుల పాటు సూల్ కాంప్లెక్స్ సమావేశాలు, ఒక రోజు పేరెంట్-టీచర్ మీటింగ్(పీటీఎం) తదితర విద్యా ప్రణాళిక కార్యక్రమాల్లో నిమగ్నమైనందున పరీక్షల విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.