ఆదివారం 24 జనవరి 2021
Business - Oct 16, 2020 , 01:12:20

బుల్‌ పరుగుకు బ్రేక్‌

బుల్‌ పరుగుకు బ్రేక్‌

  • భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
  • మదుపరులను వెంటాడిన అంతర్జాతీయ భయాలు
  • ఒక్కరోజే కరిగిపోయిన లక్షల కోట్ల మార్కెట్‌ సంపద

ముంబై, అక్టోబర్‌ 15: దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. గురువారం సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో 10 రోజుల ర్యాలీకి తెరపడినైట్లెంది. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు.. భారతీయ మార్కెట్లను కుదిపేశాయి. ఉదయం ఆరంభం నుంచే నష్టాల్లో కదలాడిన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా దిగజారాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 1,066.33 పాయింట్లు లేదా 2.61 శాతం క్షీణించి 39,728.41 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 290.70 పాయింట్లు లేదా 2.43 శాతం కోల్పోయి 11,680.35 వద్ద నిలిచింది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ రంగం, ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత 10 రోజులుగా మార్కెట్లు వరుసగా లాభాల్లోనే ట్రేడ్‌ అవుతుండటంతో చాలామంది ఈ లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ఈ పరిణామం కూడా భారీ నష్టాలకు దారితీసింది. టెలికం, బ్యాంకింగ్‌, ఇంధన, ఫైనాన్స్‌, టెక్నాలజీ, ఐటీ సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. 3.54 శాతం మేర క్షీణించాయి. ప్రధాన ఐరోపా స్టాక్‌ మార్కెట్లు 3 శాతం వరకు నష్టపోగా, చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా తదితర ఆసియా సూచీలూ 2 శాతం వరకు పతనమయ్యాయి.

బ్లూచిప్‌ షేర్లు విలవిల

సెన్సెక్స్‌ షేర్లలో ఏషియన్‌ పెయింట్స్‌ మినహా మిగతా షేర్లన్నీ నష్టాలకే పరిమితం కావడం గమనార్హం. ఏషియన్‌ పెయింట్స్‌కు కూడా స్వల్పంగా 0.32 శాతం లాభాలే వచ్చాయి. ఇక బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ విలువ అత్యధికంగా 4.68 శాతం క్షీణించింది. టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లూ పెద్ద ఎత్తునే నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ సూచీలూ 1.75 శాతం వరకు పడిపోయాయి.

లిఖితా ఇన్‌ఫ్రా అదుర్స్‌

హైదరాబాద్‌ ఆధారిత సంస్థ లిఖితా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. స్టాక్‌ మార్కెట్లలోకి అడుగు పెట్టిన రోజే అదరగొట్టేసింది. ఈ చమురు, గ్యాస్‌ పైప్‌లైన్‌ మౌలిక సేవల సంస్థ షేర్‌ విలువ గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 14 శాతం పుంజుకున్నది. బీఎస్‌ఈలో 13.83 శాతం ఎగిసి రూ.136.60 వద్ద ముగిసింది. రూ.120 వద్ద ఈ కంపెనీ షేర్‌ నమోదైంది. ట్రేడింగ్‌ ఆరంభంలోనే 8.41 శాతం వృద్ధితో రూ.130.10కు చేరడం విశేషం. ఇక ఎన్‌ఎస్‌ఈలో 13.75 శాతం లాభంతో రూ.136.50 వద్ద సంస్థ షేర్‌ విలువ నిలిచింది. ఈ నెలారంభంలో వచ్చిన లిఖితా ఇన్‌ఫ్రా పబ్లిక్‌ ఇష్యూ 9.51 రెట్లు అధికంగా సబ్‌స్ర్కైబ్‌ అయిన విషయం తెలిసిందే. 

కారణాలివే..

 అమెరికా ఉద్దీపన ఆశలపై నీళ్లు

కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు మరో దఫా తేవాలనుకున్న ఉద్దీపనలు ఇప్పట్లో ఉండబోవన్న అంచనాలు మదుపరులను పెట్టుబడుల ఉపసంహరణ వైపు పరుగులు పెట్టించాయి. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ఉద్దీపనలకు అవకాశం కనిపించడం లేదని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్‌ మ్నూచిన్‌ వ్యాఖ్యానించారు.అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం

మళ్లీ రేకెత్తిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు సైతం మార్కెట్లను కుప్పకూల్చాయి. చైనాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ను ట్రేడ్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ట్రంప్‌ సర్కారుకు అక్కడి విదేశాంగ శాఖ వర్గాలు ప్రతిపాదించాయి. ఈ నిర్ణయం యాంట్‌ గ్రూప్‌ పబ్లిక్‌ ఇష్యూను ప్రభావితం చేస్తున్నది. 

కరోనా వైరస్‌ ఆందోళనలు

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను కరోనా మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేసింది. తగ్గుముఖం పట్టాయన్న వైరస్‌ కేసులు అంతర్జాతీయంగా తిరిగి విజృంభిస్తుండటం మార్కెట్లను కుదిపేశాయి. దీంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు రావచ్చన్న అంచనాలు మదుపరులను లాభా ల స్వీకరణ వైపు నడిపించాయి. 

ఐటీ  కుదేలు

ఐటీ, బ్యాంకింగ్‌ ఇతరత్రా ఆర్థిక షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యాయి. ప్రధాన సూచీ లు నష్టాల్లో సాగడంతో ఆ ప్రభావం ఇతర రంగాల షేర్లపైనా కనిపించింది. 

రూ. 3.25  లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ మార్కెట్ల భారీ నష్టాలతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.3.25 లక్షల కోట్లకుపైగా కరిగిపోయింది. సెన్సెక్స్‌ 1,066 పాయింట్లు క్షీణించడంతో బీఎస్‌ఈలో నమోదైన సంస్థల మార్కెట్‌ విలువ రూ. 3,25, 464.52 కోట్లు దిగజారింది. రూ.1,57,31,141.32 కోట్లకు పడిపోయింది. ‘గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల బలహీనత, అమెరికా ఉద్దీపనల ఆశలు ఆవిరైపోవడం, ఐరోపా దేశాల్లో మళ్లీ కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగడం వంటివి దేశీయ స్టాక్‌ మార్కెట్ల పతనం వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి’ అని చాయిస్‌ బ్రోకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ విశ్లేషించారు.


logo