ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 22, 2021 , 20:56:47

రూట్ మార్చిన వ‌జ్ర వ్యాపారులు.. సూర‌త్ వైపు చూపు!!

రూట్ మార్చిన వ‌జ్ర వ్యాపారులు.. సూర‌త్ వైపు చూపు!!

సూర‌త్‌: దేశీయ ఆర్థిక‌, పారిశ్రామిక రంగాల‌పై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం చూపుతుందా? వివిధ రంగాల ప‌రిశ్ర‌మ‌లు రూట్ మారుస్తున్నాయా? అంటే.. అవున‌నే స‌మాధానం వ‌స్తున్న‌ది. ఇప్ప‌టికైతే ముంబైలోని బ‌డా వ‌జ్ర‌ వ్యాపారులంతా గుజ‌రాత్‌లోని సూర‌త్ వైపు చూడ‌టం మొద‌లు పెట్టారు. గుజ‌రాత్ రాష్ట్ర ఆర్థిక రాజ‌ధానిగా పేరొందిన సూర‌త్ రూపు రేఖ‌లు మారిపోనున్నాయి.


వ‌జ్రాల వ్యాపార సంస్థ‌ల కోసం సూర‌త్‌లో ఆరు ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రూ.2,400 కోట్ల అంచ‌నా వ్య‌యంతో అతిపెద్ద భ‌వ‌నం నిర్మాణం అవుతున్న‌ది. ఈ భ‌వ‌నంలో దేశంలోని ప్ర‌ధాన వ‌జ్రాల వ్యాపారులు ఈ భ‌వ‌నంలో కార్యాల‌యాల‌ను వ‌చ్చే ఏప్రిల్‌-మే నెల‌ల్లో ప్రారంభించే అవ‌కాశాలు ఫుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. 


ఈ భ‌వ‌నంలో కార్యాల‌య స్పేస్ కోసం బిల్డ‌ర్ల‌కు ముంబై నుంచి ప్ర‌తివారం వెయ్యికి పైగా కాల్స్ వ‌స్తున్నాయంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్ధం ప‌డుతున్న‌ది. సూర‌త్‌లో ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌కు వ్యాపారులు రెండు వారాల పాటు వేచి ఉండాల్సి వ‌స్తున్న‌ద‌ని స్కైలాండ్ గ్రూప్ బిల్డ‌ర్ పీయూష్ షేట్ చెప్పారు. ముంబైలో మాదిరిగా వ‌స‌తులు, వ‌జ్రాల వ్యాపారుల‌కు సానుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి తాము ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు. 


వ‌జ్ర వ్యాపారులు ముంబైలో త‌మ లావాదేవీల‌ను మూసివేసి.. సూర‌త్‌కు త‌ర‌లిపోవాల‌ని త‌ల‌పోస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌జ్ర వ్యాపారుల ప్ర‌ధాన కార్యాల‌యాల‌న్నీ బంద్రా- కుర్లా కాంప్లెక్స్‌లోనే కొలువు తీరి ఉన్నాయి. బొరివాలీ, మ‌లాడ్‌, గోరేగావ్‌, దాహిసార్ ప్రాంతాల్లోనూ డైమండ్ కంపెనీల యూనిట్లు ఉన్నాయి.


కానీ క‌రోనా మ‌హ‌మ్మారి విజ్రుంభిస్తున్న స‌మ‌యంలో ముంబై నుంచి సూర‌త్‌కు 70 వ‌జ్రాల వ్యాపారులు వ‌ల‌స వ‌చ్చారు. వ‌చ్చే మూడు/ ఐదేండ్ల‌లో 500 పై చిలుకు వ‌జ్రాల కంపెనీలు సూర‌త్‌కు మ‌ళ్లిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సూర‌త్‌లో వ‌జ్ర వ్యాపారుల భ‌వ‌నంతోపాటు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం సాగుతున్న‌ది. 


వ‌చ్చే ఏడాది జూన్ నుంచి సూర‌త్ కేంద్రంగా వ‌జ్రాల వ్యాపారం ప్రారంభం కానున్న‌ది. సూర‌త్‌లోని వ‌జ్రాల వ్యాపార భ‌వ‌నానికి స‌మీపంలోనే మెట్రో రైల్ స్టేష‌న్ కూడా నిర్మాణంలో ఉన్న‌ది.  అంతేకాదు.. సూర‌త్‌లో వ‌జ్రాల వ్యాపారం ప్రారంభం అయితే సుమారు 50 వేల మందికి ఉపాధి ల‌భించ‌నున్న‌ది. ప్ర‌స్తుతం వ‌జ్రాల త‌యారీ సంస్థ‌ల‌న్నీ సూర‌త్ ప‌రిస‌రాల్లోనే ఉండ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.  

VIDEOS

logo