Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేసింది. రూ.2,929.05 కోట్ల రుణ మోసం కేసులో (Bank Fraud Case) అనిల్ అంబానీపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ చర్యలు చేపట్టింది. ముంబైలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), దాని డైరెక్టర్ అనిల్ అంబానీ, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో సంబంధమున్న రూ.2,000 కోట్ల మోసపూరిత ఎస్బీఐ రుణం కేసులో అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఇటీవలే సోదాలు చేపట్టిన (CBI Raids) విషయం తెలిసిందే.
ఫ్రాడ్‌గా గుర్తించిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనిల్ అంబానీని ఇప్పటికే ఫ్రాడ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐసహా ఆయా బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు తాజా ఫైలింగ్‌నుబట్టి తెలుస్తున్నది. అయితే ఈ నిధులను దుర్వినియోగపర్చినట్టు తాము గుర్తించామని ఆర్‌కామ్‌కు పంపిన లేఖలో ఎస్బీఐ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌కామ్ నడుచుకున్నట్టు పేర్కొన్న బ్యాంక్.. దీన్నో మోసపూరిత రుణంగా వర్గీకరించాలని తమ ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ తీర్మానించినట్టు తేల్చిచెప్పింది. ఇచ్చిన రుణంలో రూ.13,667.73 కోట్లను రుణ చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడుకోవాలని.. అలాగే రూ.12,692.31 కోట్లను కనెక్టెడ్ పార్టీల చెల్లింపులకు వినియోగించాలన్నది నిబంధన.
కానీ 2016లో రుణ చెల్లింపులకు రూ.6,265.85 కోట్లను, కనెక్టెడ్ పార్టీలకు రూ.5,501.56 కోట్లనే ఇచ్చారని ఎస్బీఐ చెప్తున్నది. దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.250 కోట్ల రుణం, ఐఐఎఫ్‌సీఎల్ నుంచి పొందిన రూ.248 కోట్ల రుణాలకు సంబంధించి కూడా ఇదే అవకతవకల్ని గుర్తించినట్టు సమాచారం. కాగా, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటిస్తే.. 21 రోజుల్లోగా ఆ వివరాలను ఆర్బీఐకి నివేదించాల్సి ఉంటుంది. అంతేగాక పోలీసులు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఫిర్యాదు చేయాలి.
Also Read..
Onam | కేరళలో ఘనంగా ఓనం వేడుకలు.. ప్రత్యేకతలు ఇవే..
Ajit Pawar | నీకు ఎంత ధైర్యం..? ఐపీఎస్ అధికారిణికి అజిత్ పవార్ బెదిరింపులు
Donald Trump | రక్షణశాఖ కాదు.. ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ : ట్రంప్