తురపల్లి,మార్చి 16 : కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల సాకారమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దూరదృష్టివల్ల వర్షాలు లేక ఎండిపోతున్న చెరువుల్లోకి జరజర అంటూ గోదారమ్మ వచ్చి చేరుతోంది. పంటలు సాగు చేస్తామన్న సంకల్పం రైతుల్లో కలుగుతోంది.
మండువేసవిలోనూ తురపల్లి, మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సిద్దిపేట జిల్లా మరుక్ వద్ద ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జిల్లాల విడుదలతో తురపల్లి మండలంలోని గోపాలపురం పోచమ్మ చెరువు, పుట్టని కుంట, నాగయపల్లి చెరువు, వాసాలమర్రి గ్రామంలోని పంచకుంట, కొత్త కుంట, మైసోనికుంట తోకచెరువు, మాదాపురం గ్రామంలోని జగ్గయ్య చెరువు, కొత్తచెరువు, చిన్న లక్ష్మీపురం దాపల చెరువు, మలాపురం చెరువు, ధర్మారం గోవిందు చెరువులు నిండుకుండల్లా మారి మత్తళ్లు దుంకుతూ వేసవిలోనూ పంటలకు జీవం పోస్తున్నాయి.
జిల్లాలోని రెండు మండలాలైన తురపల్లి,బొమ్మలరామారం, మండలాల్లో సాగు జలాలు అందించాలన్న లక్ష్యంతో నాటి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి 2020లో తురపల్లి ప్రధాన కాల్వకు కొండపోచమ్మ సాగర్ జలాలను విడుదల చేశారు. నాటి నుంచి పలు దఫాలుగా జిల్లాలోని రెండు మండలాలకు గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. కాళేశ్వరం జలాలతో 31 చెరువులు నింపడంతో ప్రత్యక్షంగా 2500 ఎకరాలకు సమృద్ధిగా సాగు నీరు అందుతుండగా.. పరోక్షంగా వేలాది ఎకరాల్లో భూగర్భ జలాలు పెరిగి పంటలకు ఆదరువుగా మారాయి. కాళేశ్వరం కూలేశ్వరమని, లక్ష కోట్లు వృధా అని, సీఎం ఆయన మంత్రివర్గం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను, నాటి ప్రభుత్వాన్ని అన్ని విధాలా బద్నాం చేసి ప్రజల దృష్టి మరల్చాలని చూసినా జనం, రైతుల నుంచి వస్తున్న ఆగ్రహంతో అవే కాళేశ్వరం జలాలను స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లోని చెరువులు గోదావరి జలాల సవ్వడితో రైతుల పంట పొలాలు పచ్చబడి వారి ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తున్నది.

రైతులకు సాగునీటి సమస్య రావద్దని మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి అధికారులు గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతోగ్రామంలోని చెరువుల్లోకి నీళ్లు చేరాయి. ఫలితంగా మా వ్యవసాయం గత ఆరు ఏండ్లుగా సాఫీగా సాగుతోంది. బీడు భూములకు గోదావరి జిల్లాలు తెచ్చిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందు చూపుతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు విడుదల చేయడంతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిషారం దొరికింది. గ్రామంలోని అతిపెద్ద చెరువులైన జగ్గయ్య చెరువు, కొత్తచెరువులు నీటి విడుదలతో నిండుకుండలుగా మారాయి. ఒకప్పుడు కరువు తాండవించిన నేలపై గోదావరి పరవళ్లు తొకుతుండటంతో పంటలు పచ్చబడ్డాయి.