సూర్యాపేట, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం అంతా ఓ డ్రామా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో గొప్పగా 99 రోజుల కార్యక్రమం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయకపోవడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణ ప్రగతి పేరిట చేపట్టిన కార్యక్రమాలకు రూ.కోట్లాది నిధులు ఇచ్చింది. నేడు కూడా అలాగే వస్తాయని, సులువుగా కార్యక్రమాలు నిర్వహించవచ్చని అనుకున్నామే.. కానీ నిధుల ఊసే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వారంతా ప్రస్తుతం శానిటేషన్, ఫైల్స్ క్లియరెన్స్, ట్రెయినింగ్ ప్రోగ్రాములు నిర్వహిస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ వాట్సాప్, ఇన్స్టాగ్రాం తదితర సోషల్ మీడియా ప్రచారాలతోనే సరిపెడుతున్నారు. ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు పెట్టి, ప్రజల్లోకి వెళ్లాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ పైఫల్యాలతో జనం నిలదీస్తారనే భయం తో జంకుతున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని కలెక్టర్లందరితో మార్చి 3న సమావేశం నిర్వహించి ప్రజాపాలన-పగతి ప్రణాళిక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ప్రభు త్వం 99 రోజుల కార్యక్రమం చేపడితే తమ గ్రామాలు కొద్దోగొప్పో బాగుపడతాయని అంతా భావించారు. కార్యక్రమం ప్రారంభమైందే కానీ ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు జనంలోకి వెళ్లాలంటనే జంకుతున్నారు.
ప్రస్తుతం ఉన్న సిబ్బందిని వాడుకొని పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమం చేపడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఫొటోలకు ఫోజులిస్తుండగా ఏప్రిల్ 2 నుంచి జరగబోయే కార్యక్రమాలకు నిధులు ఎలా సమకూర్చాలి.. ఎవరు ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామ పంచాయతీ నిధుల నుంచి వాడుకోవచ్చనే ఆదేశాలు ఇప్పటి వరకు రాకపోవడంతో ఏప్రిల్ 2న పంచాయతీల్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, సీఎం ప్రసంగం వినిపించడం, వచ్చే వారందరికీ చాయ్ బిస్కెట్లు ఇవ్వాలంటే ఒక్క రోజుకే దాదాపు రూ.40వేల వరకు ఖర్చు వస్తుందని, దీంతో పాటు ఒక రోజు క్రీడలు నిర్వహించడం, అలాగే అనేక ఇతర కార్యక్రమాలకు అయ్యే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని ప్రజాప్రతినిధులు, అధికారులను చర్చించుకుంటున్నారు.
దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి వస్తోందంటేనే జనం నిలదీసేందుకు సిద్ధమతున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు కేసీఆర్ అమలు చేసిన రైతు భరోసా తదితర అనేక పథకాలపై కూడా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలా అని అధికారులు, సర్పంచ్లు జంకుతున్నారు. ఇప్పటికైనా గత ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో కొన్ని అయినా అమలు చేసి, 99 రోజుల కార్యక్రమానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తేనే కార్యక్రమం సజావుగా కొనసాగుతుందని, లేని పక్షంలో ఎక్కడికక్కడ మమ అనిపించడమే జరుగుతుందని పలువురు అధికారులు, సర్పంచ్లు అభిప్రాయపడుతున్నారు.