హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియను తెలంగాణ రవాణాశాఖ ప్రారంభించింది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ, నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్ సంస్థలతో సోమవారం సమావేశమైనట్టు ప్రకటనలో తెలిపింది. రెండు దఫాలుగా నిర్వహించిన సమావేశాలకు రవాణా కమిషనర్ డాక్టర్ కే ఇలంబర్తి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అధ్యక్షత వహించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ కిట్లతో మార్చేందుకు రూపొందించబోయే విధానంపై రెట్రోఫిట్మెంట్ సంస్థలతో విసృ్తతంగా చర్చించినట్టు అధికారులు తెలిపారు. చర్చల్లో సాంకేతిక ప్రమాణాలు, భద్రతా నిబంధనలు, సర్టిఫికేషన్ ప్రక్రియ, వ్యయ నిర్మాణం, బ్యాటరీ సాంకేతికతలు(స్వాపబుల్ అండ్ ఫిక్స్డ్ బ్యాటరీ వ్యవస్థలు), అమలు విధానాలపై వివరణాత్మకంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి గల సాధ్యాసాధ్యాలపై రెట్రోఫిట్మెంట్ సంస్థలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ద్వారా వాయు కాలుష్యం తగ్గడం, ఆటో డ్రైవర్లకు ఆపరేటింగ్ ఖర్చులు తగ్గడం, పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపాయి.