మునుగోడు, మార్చి16 : మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మునుగోడు, చిట్యాల మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల రైతులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలకు ఆతీతంగా నాయకులు ధర్నాలో పాల్గొని స్థానిక తహసీల్దార్‌కు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వ్యవసాయమే వృత్తిగా ఉన్న రైతులు భూగర్భ జలాలపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారన్నారు.
దురదృష్టవశాత్తు మునుగోడు మండలం ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతంగా మారిందని, ఫ్లోరైడ్ వ్యవసాయానికి మాత్రమే కాకుండా, మనుషులకు కూడా ప్రమాదకరంగా మారిందన్నారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు కింద కాల్వలను పూర్తి చేసి మండలంలోని చెరువులకు నీరందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి కాల్వల ద్వారా నీరందించాలని డిమాం డ్ చేశారు. లేనిపక్షంలో ఉదయ సము ద్రం రైతాంగ వేదిక ద్వారా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
కోదాడ రూరల్, మార్చి16: వారబందీ నిబంధనతో ఆర్కే మేజర్ కాల్వ నీటి విడుదల నిలిచిపోవడంతో మేజర్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పంటలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండటంతో పంట చేలు ఎండి తాలు అయ్యే అవకాశం ఉంది. తక్షణమే నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని మండలంలోని రైతులు కోరుతున్నారు. మండల పరిధిలోని ఆర్కే మేజర్ పరిధిలోని రైతులు నీటి విడుదలపై అధికారులకు ఎన్ని సార్లు విన్న వించుకున్నా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిని విడుదల చేసి పొట్టదశలో ఉన్న వరి పంటను రక్షించాలని కోరుతున్నారు.