Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి (Woman IPS Officer) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నీకు ఎంత ధైర్యం..?’ అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సోలాపుర్ (Solapur)లోని కుర్దూ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ (Anjana Krishna)కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమె రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం ఆ గ్రామాన్ని సందర్శించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంతలో పలువురు ఎన్సీపీ నేతలు అక్కడికి చేరుకని అంజనా కృష్ణను అడ్డుకున్నారు. అందులో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్‌ను సదరు అధికారిణికి ఇవ్వాలని అజిత్ సూచించగా.. అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు.
‘నేను డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను మాట్లాడుతున్నాను. మీ చర్యలను వెంటనే ఆపి అక్కడి నుంచి వెళ్లిపోండి’ అని అన్నారు. అయితే, అజిత్ పవార్ వాయిస్‌ను గుర్తుపట్టని అంజనా కృష్ణ.. ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా..? అంటూ ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకునేందుకు తన నంబర్‌కు వీడియో కాల్ చేయాలంటూ సూచించారు. ఆమె మాటలకు ఆగ్రహించిన డిప్యూటీ సీఎం ‘నీకు ఎంత ధైర్యం..? నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా..?’ అంటూ మండిపడ్డారు. తనకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. దీంతో ఆమె వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి డిప్యూటీ సీఎంతో మాట్లాడారు. అక్కడే ఉన్న కొందరు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారి వివాదానికి కారణమైంది.
Also Read..
బీహార్ ఎన్డీఏలో సీట్ల లొల్లి.. కూటమి పార్టీల్లో ముసలం
గుంతల రోడ్లతో రోజుకు ఐదుగురు మృతి!
దేశంలో సగం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు.. ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ టాప్