న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: నగరం, పట్టణం, గ్రామీణం ఎక్కడ చూసినా మన దేశంలోని చాలా రోడ్లు గుంతలతో ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. అయితే ఈ గోతులు ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాక, అధిక సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని, దేశంలో రోజూ సగటున ఐదుగురు ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో 2019-2024 మధ్య గుంతల రోడ్ల కారణంగా 9,109 మంది మరణించగా, అందులో 4,792 మంది బీజేపీ పాలిత యూపీకి చెందిన వారేనని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తెలిపింది. 2023లో సగటున రోజుకు ఆరుగురు చొప్పున 2,161 మంది మరణించారు.
వీరిలో 1,320 మంది (61.1 శాతం) యూపీకి చెందిన వారే. అక్కడ రోజుకు సగటున నలుగురు కన్నుమూశారు. ఇక మధ్యప్రదేశ్ 177 మరణాలతో, తమిళనాడు 159 మరణాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ ఏడాది ఈ మూడు రాష్ర్టాల్లో మాత్రమే వంద కంటే ఎక్కువ మంది చనిపోయారు. అయితే ఈ గుంతల మరణాలకు సంభవించి ఇటీవలి సంవత్సరాల డాటా లభ్యం కాలేదని అధికారులు తెలిపారు.