న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశంలోని 47 శాతం మంత్రులు తమపై హత్య, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలతోసహా తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నేరారోపణలతో అరెస్టయి 30 రోజులు జైలులో ఉన్న పక్షంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు పదవులు కోల్పోవడానికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం.
23 రాష్ట్ర అసెంబ్లీలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు), కేంద్ర మంత్రివర్గం నుంచి 643 మంది మంత్రులకు చెందిన స్వీయ అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ వీరిలో 302 మంది మంత్రులు (47 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని తెలిపింది. ఈ 302 మందిలో 174 మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు.
అత్యధిక రాష్ర్టాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన 336 మంత్రులలో 136 మంది(40 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా వీరిలో 88 మంది (26 శాతం) సీరియస్ కేసులు ఎదుర్కొంటున్నారు. 4 రాష్ర్టాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు చెందిన 45 మంది మంత్రులు(74 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించగా వీరిలో 18 మందిపై (30 శాతం) తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే డీఎంకేకి చెందిన 31 మంత్రులలో 27 మందిపై (87 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 14 (45శాతం) మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్కు ఉన్న 40 మంది మంత్రులలో 13 (33 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మంది మంత్రులలో 22 (96 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉండగా వీరిలో ఐదుగురిపై(31 శాతం) తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి.
జాతీయ స్థాయిలో 72 మంది కేంద్ర మంత్రులలో 29 మంది (40 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలో 60 శాతానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా హర్యానా, జమ్ము కశ్మీరు, నాగాలాండ్, జార్ఖండ్లో మంత్రులపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేకపోవడం విశేషం. ఇక ఆస్తుల ప్రకటనకు సంబంధించి 643 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ. 37.21 కోట్లు ఉండగా మంత్రులందరి ఆస్తులు కలిపి రూ. 23,929 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.