పాట్నా, సెప్టెంబర్ 4: ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల లొల్లి ప్రారంభమైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు (80) గెల్చుకున్నప్పటికీ, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఇంతవరకు చిన్న భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీలు ఇకపై కేవలం సహకారం అందించే పాత్రకే పరిమితం కారాదని భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ పార్టీలు ఎక్కువ సీట్లను కోరుతున్నాయి. దీంతో ఎన్డీఏలో ముసలం మొదలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లను గెల్చుకున్న చిరాగ్ పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వేళ అన్ని సీట్లు తమకు ఇవ్వకపోతే మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని చిరాగ్ పాశ్వాన్ హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని మీడియా సమావేశాల్లో స్పష్టం చేయడమే కాక, పలు అంశాల్లో పార్టీ సొంత వైఖరిని వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగినంత కాలం తమ మద్దతు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేస్తున్నారు.
కాగా, స్థానికంగా తమకు ఎక్కువ మద్దతు ఉన్న గయా, ఔరంగాబాద్‌ల్లోని అన్ని సీట్లను తమకే కేటాయించాలని మరో సంకీర్ణ పార్టీ హెచ్ఏఎం చీఫ్ జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన 20 సీట్లు అడుగుతున్నారు. తమ పార్టీ మద్దతు లేకుండా ఎన్డీఏ విజయం సాధించలేదని అయన ప్రకటించారు. ప్రస్తుతం తమ కూటమిలోని పార్టీలు విడిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీపై ఉంది. ఆ పార్టీల డిమాండ్లను సమన్వయంతో పరిష్కరించకపోతే అవి విడిగా పోటీచేసే ప్రమాదం ఉంది. దీంతో కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలి విజయావకాశాలు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని మరోవైపు మహాఘట్ బంధన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కూటమి ఎక్కువగా యువత, తమ సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓట్ల బ్యాంక్‌పై ఆధారపడింది. ఈ ఎన్నికల్లో తమ కూటమి పార్టీలను సమన్వయం చేయడంలో ఎన్డీఏ విఫలమైతే అది మహాఘట్ బంధన్ కూటమికి పూర్తి లాభం చేకూరుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు రాష్ట్రంలో ‘వోటర్ రైట్స్ మార్చ్’ ద్వారా పాదయాత్ర జరిపి తమ కూటమికి అనుకూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు.
కడలూర్: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఎఎంఎంకే) నేత దినకరన్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు బుధవారం ప్రకటించారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూటమిని వీడిన కొద్ది వారాలకే దినకరన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కడలూర్లో దినకరన్ విలేకరులతో మాట్లాడుతూ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ద్రోహాన్ని తన పార్టీ భరించలేదని తెలిపారు. కూటమిలో పెరుగుతున్న విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ కేంద్ర నాయకత్వం విఫలమైందని చెప్పారు.