గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 16, 2020 , 00:29:46

‘సీతమ్మ సాగర్‌'తో.. బహుళ ప్రయోజనాలు

‘సీతమ్మ సాగర్‌'తో.. బహుళ ప్రయోజనాలు

  • సీఎం ప్రత్యేక చొరవతో బరాజ్‌ నిర్మాణం వేగిరం
  • భూసేకరణకు సర్వే పనులు ప్రారంభించిన అధికారులు
  • అశ్వాపురం, మణుగూరులో పెగ్‌ మార్కింగ్‌ ఏర్పాటు 
  • ఇప్పటికే పూర్తయిన టెండర్ల ప్రక్రియ 

మణుగూరు: దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద కొత్తగా బరాజ్‌ నిర్మాణమైతే గోదావరి తీర ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి.  భూగర్భ జలాలు భారీగా పెరగనున్నాయి. పచ్చని పంటలతో పరీవాహక ప్రాంతం వర్థిల్లనుంది. పినపాక, భద్రాచలం, ములుగు నియోజకవర్గాల్లో గోదావరికి ఇరువైపులా ఉన్న ఏజెన్సీ పర్యాటక ప్రాంతంగా మారనుంది. దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన 200 మీటర్ల దూరంలో ఈ బరాజ్‌ను నిర్మించనున్నారు. గోదావరిలో 36.57 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పు,  1.525 కిలోమీటరు పొడవుతో 65 గేట్లతో ఈ బరాజ్‌ నిర్మించనున్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉండటంతో 320 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నారు. గోదావరిపై అతిపెద్ద జల విద్యుత్‌ కేంద్రం ఇదే కానుంది. ఈ బరాజ్‌ నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా రెండువైపుల 98 కిలోమీటర్ల పొడవున కరకట్టను నిర్మించనున్నారు. ఈ బరాజ్‌ నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో గోదావరిపై రెండో జలశయం కానుంది. దుమ్ముగూడెం పాత ఆనకట్ట  సుమారు 49 మీటర్ల ఎత్తు ఉండగా నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు మాత్రమే. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న ఈ బరాజ్‌ నిర్మాణం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ప్రాంతం కోనసీమను తలపించనుంది. ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు, సాగు అవసరాలకు జలాలు అందనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సీతమ్మ బరాజ్‌ ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఈ బరాజ్‌ నిర్మించేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు.  పుష్కలంగా ప్రజా అవసరాలకు గోదావరి జలాలు..

చర్యలు వేగవంతమయ్యాయి..

రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గోదావరిపై దుమ్ముగుడెం ఆనకట్టకు దిగువన కొత్తగా సీతమ్మ సాగర్‌ బరాజ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే భూ సేకరణ కోసం అధికారులు సర్వే పనులు మొదలుపెట్టారు. ఈ బరాజ్‌ ద్వారా ప్రజా అవసరాలకు గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్లతో కలిసి బరాజ్‌ నిర్మాణ ప్రదేశాన్ని ఇటీవలే పరిశీలించాను. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. 

-రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు