ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం.. ఎన్నికలు యథాతథం

అమరావతి : ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికలు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఎన్నికల వాయిదా కుదరదని తేల్చి చెప్పింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో వాయిదా వేసినట్లు ఆయన కోర్టుకు విన్నవించారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమని పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి అని ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం సబబు కాదని జస్టిస్ సంజయ్ కౌల్ వ్యాఖ్యానించారు.
ఉద్యోగుల సంఘం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో వంకతో ఎన్నికలు అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేస్తూ వెల్లడం సరికాదని అన్నారు. ఉద్యోగ, వైద్య సంఘాలు పిటిషన్లు దాఖలు చేయడం అనుమానానికి తావిస్తున్నదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.