Government Job | భర్త లేడు.. పైగా నలుగురు ఆడపిల్లలు.. అయినా ఆ తల్లి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నలుగురు కూతుళ్లను కంటికిరెప్పలా సాదుకుంటూ.. రెక్కలు ముక్కలు చేసి మరీ చదివించింది. తల్లి పడుతున్న శ్రమ చూసి ఆ పిల్లలు కూడా కష్టపడి చదివారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. నలుగురు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లెకు చెందిన సీతప్పగారి మునివెంకటప్ప, గౌరమ్మ దంపతులది సాధారణ రైతు కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు. 2007లో మునివెంకటప్ప అనారోగ్యంతో కన్నుమూశాడు. అయినప్పటికీ నలుగురు ఆడపిల్లలను కష్టపడి చదవించింది. తమ చదువుల కోసం తల్లి పడుతున్న శ్రమ చూసి.. పిల్లలు కూడా కష్టపడి చదివారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. బ్యాంకు, టీచర్, పోలీసు అని తేడా లేకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలు రాశారు. చివరకు అనుకున్నది సాధించారు. నలుగురు ఆడపిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు.
అక్కాచెల్లెళ్లలో పెద్దదైన వీణాకుమారి 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. 2016లో రెండో కుమార్తె వాణి డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగం పొందింది. రెండేళ్లలోనే ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గౌరమ్మకు ఆనందమిచ్చింది. పెద్ద కుమార్తెను కానిస్టేబుల్‌కు, రెండో కుమార్తెను టీచర్‌కు ఇచ్చి పెళ్లి చేసింది. ఇద్దరు అక్కల స్ఫూర్తితో కష్టపడి చదివిన మిగిలిన ఇద్దరు కూడా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గత నెలలో విడుదలైన పోలీసు ఉద్యోగాల ఫలితాల్లో మూడో కూతురు వనజాక్షి కానిస్టేబుల్‌గా సెలెక్టవ్వగా.. నాలుగో కూతురు శిరీష నిన్న విడుదలైన మెగా డీఎస్సీ ఫలితాల్లో ఎస్జీటీగా ఎంపికయ్యింది. తన కష్టాన్ని, నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా ఆశయాన్ని సాధించినందుకు తన నలుగురు కూతుళ్లను చూసి ఆ తల్లి ఎంతో సంతోషించింది. నలుగురు ఆడబిడ్డలను, వారిని కష్టపడి చదివించిన గౌరమ్మను ఊరి ప్రజలు ఎంతో మెచ్చుకుంటున్నారు. నలుగురికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు.
Follow Us : on Facebook, Twitter
AP DSC | మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా.. కారణం ఏంటంటే?
Ambati Rambabu | చంద్రబాబులో భయం మొదలైంది.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
Tirupati | తిరుపతి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం.. మూడుసార్లు టేకాఫ్ అయ్యి.. రన్వేపైకే రిటర్న్!