Ambati Rambabu | ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే చంద్రబాబు నాయుడు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. కేవలం 15 నెలల కాలంలోనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వస్తాడని ప్రజలకు అర్థమైందని.. అందుకే చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు పెద్దాపురం స్పీచ్‌లో ఇదే కనిపించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోతారని తెలిపారు.
చంద్రబాబులో భయం మొదలైందని.. భూత వైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థమైందని అన్నారు. సింగపూర్‌లోని ఇన్వెస్టర్లకు కూడా ఇది అర్థమైందని చెప్పారు. ఆ భయంతోనే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే దానికి కారణం చంద్రబాబే అని ఆరోపించాఉ. చంద్రబాబు దుర్మార్గం కారణంగానే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి చంద్రబాబు ఈ ప్రాజెక్టు చేపట్టారని.. కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారని వివరించారు. అందువల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టం చేశారు. కానీ ఈ నెపాన్ని జగన్‌పై నెట్టడానికి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకుని సక్రమ పరిపాలన చేయాలని అంబటి రాంబాబు హితవు పలికారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయ్యిందని పెద్దాపురం సభలో చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. సూపర్ సిక్స్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సులో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం వెళ్లవచ్చని చంద్రబాబు చెప్పారని.. డైరెక్ట్‌గా ఎలా వెళ్లవచ్చో సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని నిర్ధారణ అయ్యిందని అన్నారు. 14 నెలలకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆత్మవిశ్వాసం కోల్పోయారని అన్నారు.