Tirupati | హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం టెక్నికల్ ఇష్యూ కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మళ్లీ ల్యాండ్ అయ్యింది. ఇలా ఒక్కటి కాదు.. వరుసగా మూడు సార్లు జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఏదో సాంకేతిక లోపం ఉన్నట్లుగా పైలట్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన పైలట్ మళ్లీ ల్యాండ్ చేశారు. అలా వరుసగా మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో అరగంటకు పైగా విమానం రన్‌వేపైనే చక్కర్లు కొట్టింది. చివరకు సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని టేకాఫ్ చేయలేకపోతున్నామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది అనౌన్స్ చేశారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ హఠాత్పరిణామంతో వారంతా కంగారు పడిపోయారు. అయితే ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని ఎయిర్‌లైన్స్ అధికారులు నమ్మకం కల్పించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.