AP DSC: ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీకి (AP DSC) ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంది. అయితే దీనిని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మంగళవారం నుంచి సర్టిఫికెట్ల వెరికేషన్ను ప్రారంభిస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జూలై 6న పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫలితాలను ప్రకటించిన విద్యాశాఖ ఈ నెల 23న మెరిట్ జాబితాను విడుదల చేసింది. డీఎస్సీలో వచ్చిన స్కోర్‌తోపాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించింది.
రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్‌లెటర్లు జారీచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్‌కు కాల్ లెటర్లు పంపించి, సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉండగా.. కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో ఉంచనున్నారు.