(Bandaru Dattatreya) ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ విస్తృతంగా పర్యటించారు. ఉదయం గోపీనాథపట్నం చేరుకున్న ఆయన.. అక్కడ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు స్వగ్రామం మోగల్లులో పర్యటించి అక్కడ ఒక మొక్క నాటారు.
ద్వారకా తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల కోసం నిడమర్రు మండలం ఫల్లేపురానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. ఇక్కడే నిత్యం భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఈ భవనాన్ని హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ చేస్తున్న సేవలు మరువరానివని కొనియాడారు. అలాగే, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకోవాలని సూచించారు.
అనంతరం ఉంగుటూరులో శ్రీలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ధర్మరాజుతోపాటు డైరెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, బీజేపీ నేతలు మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు స్వగ్రామం మోగల్లులో పర్యటించారు. అక్కడ అల్లూరి నివసించిన ఇంటి వద్ద మొక్క నాటారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు కృషిచేస్తానని చెప్పారు. అంతకుముందు విజయవాడ విమానాశ్రయంలో దత్తాత్రేయకు బీజేపీ శ్రేణులు, నాయకులు ఘనంగా స్వాగతించారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్డీవో రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. రోడ్డు మార్గం గుండా దత్తాత్రేయ పశ్చిమ గోదావరి పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..