
నిర్మల్ టౌన్ : భైంసా మండలంలోని మహాగాం గ్రామపంచాయతీ సర్పంచ్ రాకేశ్‌పై , అతని కుటుంబసభ్యులపై దాడి చేసిన ఉప సర్పంచ్ శారద, ఆమె భర్త పోశెట్టిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా సర్పంచ్ల సంఘం శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీకి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులను అడ్డుకుంటూ, పనుల్లో తమకు వాటా ఇవ్వాలని పదే పదే వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 
ఉప సర్పంచ్‌ను, ఆమె భర్త ఎంపీటీసీని పదవుల నుంచి వెంటనే తొలగించాలని కోరారు. వారిద్దరితో పాటు ఎంపీటీసీ అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇప్పటికే జిల్లా ఉప సర్పంచ్‌లు అనేక చోట్ల ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నాయకులు వీరేశ్, రాకేశ్, నారాయణ, అచ్యుత్‌రావు, రాజేందర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.