కుంటాల : అప్పుల బాధతో మనస్థాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రాజారాం గజేందర్ (49) కూలీ పనులు చేస్తూ జీవనం గడిపేవాడు. కాగా, గత మూడు సంవత్సరాల నుండి ఒకరి దగ్గర తొమ్మిది ఎకరాలు, ఇంకొకరి దగ్గర రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా సరైన దిగుబడి రాక, పంట పెట్టుబడికి ఖర్చులు పెరిగి 4 లక్షల వరకు అప్పు అయింది. ఆ బాధతో మనస్థాపం చెంది శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చేనులోకి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి .. గ్రామ శివారులోని ఓ చెట్టు ఎక్కి తాడుతో ఉరి వేసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత పలువురు గ్రామస్తులు చెట్టుపై వేలాడుతున్న మనిషిని గుర్తుపట్టి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతునికి తల్లిదండ్రులు, భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఏఎస్ఐ జీవన్ రావు తెలిపారు.