నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 5 : నిర్మల్ జిల్లాకే తలమానికంగా నిలిచేలా రూ.3 కోట్ల నిధులతో మహాలక్ష్మీ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని బంగల్ కాలనీలో నిర్మిస్తున్న అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుమందు ప్రథమ శిల పనులను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్ వరకు పనులు పూర్తయ్యాయని ఏప్రిల్, మే వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు స్తపతికి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.3 కోట్ల అంచనా వ్యయంతో అమ్మవారి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నామని, కాంచీపురం నుంచి తీసుకువచ్చిన కృష్ణ శిలలతో ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. తిరుపతికి చెందిన శిల్పులు అద్భుతంగా పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కల్యాణ మండప నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రి వెంట ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎమెల్సీ దండె విఠల్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాకాల రాంచందర్, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నేరెళ్ల వేణు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, పద్మాకర్, కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.