నిర్మల్ టౌన్, జనవరి 27: దళితబంధు బంధు ఎన్నో దళిత కుటుంబాలకు వరంగా మారబోతున్నది. దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించగా, ఈ మేరకు మొదటి దశలో తొలి విడుతలో నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 27,41,239 మంది జనాభా ఉండగా, ఇందులో 4,88,596 మంది దళితులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దళితబస్తీ స్వయం ఉపాధి అవకాశాల కింద 12,335 మందికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడంతో మిగిలిన కుటుంబాల్లో పేద వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు ప్రారంభం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే దళిత అభివృద్ధి, సంక్షేమశాఖ లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను జారీ చేయడంతో ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలుండగా, ప్రతి నియోజకవర్గంలో వంద మంది అత్యంత నిరుపేద దళిత కుటుంబాలను, ఏ ఆధారం లేని వారిని మొదటి ప్రాధాన్యత కింద ఎంపిక చేయనున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు సమన్వయంతో వ్యవహరించి ఆయా మండలాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అత్యంత నిరుపేదలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి ఉపాధి కల్పించనున్నారు. ఇందులో మహిళలలు, దివ్యాంగులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టి మార్చి 7లోపు ఎంపిక చేసిన లబ్దిదారుల్లో రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి యూనిట్లను ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపికైన లబ్దిదారుల వివరాలు బ్యాంకు ఖాతా, తదితర అంశాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందులో రూ.10లక్షల నిధుల్లో రూ.10వేలు లబ్ధిదారుల రక్షణ నిధిగా ఉపయోగించుకోనుండగా.. మిగతా వారు నెలకొల్పనున్న యూనిట్ ఆధారంగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసే అధికారం కలెక్టర్లకు మాత్రమే అప్పగిస్తున్నారు. దీనివల్ల దళితబంధు పథకం దుర్వినియోగం కాకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
అనేక ఉపాధి అవకాశాలకు దారి…
దళితబంధు పథకం కింద రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేయడంతో పాటు దానికనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక యూనిట్లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగం, కుటీర పరిశ్రమలను నెలకొల్పేందుకు ఈ రుణాలను ప్రాధాన్యతా క్రమంలో అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దళితబంధు ద్వారా రూ.10లక్షల ఆర్థిక చేయూత అందడంతో గ్రామాల్లో యూనిట్ వారీగా సామూహిక గ్రూపులను ఏర్పాటు చేసి స్థానిక అవసరాలకనుగుణంగా ఉపాధి పొందేందేకు అనువైన పరిశ్రమలను ఎంపిక చేసుకునేలా అధికారులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే జిల్లా పరిశ్రమలశాఖ ద్వారా ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు ఉపయోగపడుతాయో తెలుసుకుంటున్నారు. దళితబంధు పథకం క్షేత్రస్థాయిలో అమలు చేయడంపై దళిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
దళితబంధు ద్వారా ఈసారి ప్రభుత్వం యూని ట్‌కు రూ.10లక్షల చొప్పు న మంజూరు చేయడం ఎంతో ప్రాధాన్యతతో కూ డింది. నిధులను సద్విని యోగం చేసుకొని స్వయం ఉపాధి పొందేలా నిరుపేద దళిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా దళితబంధును అమలు చేసేందుకు ఇప్పటికే గ్రామస్థాయిలో చర్యలు తీసు కుంటున్నాం. ఏ పరిశ్రమలు నెలకొల్పాలో ఒక అంచనాకు కూడా వస్తున్నాం.
-హన్మండ్లు, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ, నిర్మల్
మాట తప్పని ముఖ్యమంత్రి కేసీఆర్
మాది కుభీర్ మండలం పల్సి. మాకు సొంత భూ మి లేకుండే. కైకిలి పోయి కుటుంబాన్ని పో షించుకు నేటోళ్లం. దళిత బస్తీ కింద మూడెకరాల భూమి ఇచ్చా రు. ఆభూమిని సాగుచేసు కుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ ఏ మాట ఇచ్చినా కచ్చితంగా నెరవేరుస్తారు. ఎలక్షన్లో పెన్షన్ పెంచుతానని చెప్పి పెంచిన్రు. రైతుబంధు ఇస్తనన్నరు..ఇచ్చిండ్రు. ఇప్పుడు దళిత బంధు ఇస్తామన్నరు ఇస్తరు. మాకు సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంది.
-పూజెకర్ నీలాబాయి, పల్సి, కుభీర్ మండలం