కుభీర్, జూలై 23 : మహిళలు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకాంక్షించారు. బుధవారం కుభీర్ మండల కేంద్రానికి చెందిన గోరేకర్ అంజన అనే యువతికి ఆ పథకం ద్వారా మంజూరైన కుట్టు మిషన్ ను మండల నాయకులతో కలిసి భైంసా పట్టణంలోని తన నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గల స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం ద్వారా తీసుకున్న రుణాల ద్వారా చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా ఎదిగినప్పుడే సంఘంతో పాటు సంఘంలోని సభ్యులు బలోపేతం అవుతారన్నారు. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరి ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకోవాలని కోరారు.