Peddapalli | పెద్దపల్లి రూరల్ ఫిబ్రవరి 26: పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల నేపథ్యంలోనే ఆమెను సస్పెండ్ చేసినట్లుగా చర్చ జరుగుతోంది.
కొన్నేళ్లుగా వ్యవసాయ శాఖ అధికారుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా సమన్వయం లోపించింది. ఈ క్రమంలోనే వ్యవసాయ అధికారులకు సంబంధించి ఒకదాని తర్వాత మరో సంఘటనలు బయటకొస్తున్నాయని పెద్దపల్లిలో చర్చ నడుస్తోంది. గత వారం రోజులుగా అధికారుల మధ్య జరుగుతున్న వివిధ రకాల పర్యావసానాలే మండల వ్యవసాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ తనిఖీలకు దారి తీసిందని.. అందులో వెలుగు చూసిన విషయాల ఆధారంగానే క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం. ఏసీబీ విచారణ పూర్తయ్యే వరకు ఆమె సస్పెన్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు.