Mexican Couple : భారతీయ సంస్కృతి (Indian Culture), సంప్రదాయాలను గౌరవించేవాళ్లు ఈ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు నచ్చి ఎంతో మంది భారత్లో పర్యటిస్తుంటారు. పర్యాటక ప్రదేశాలు (Tourist places), ఆధ్మాత్మిక క్షేత్రాలను సందర్శించి వాటి గురించి ఆసక్తిగా తెలుసుకుంటారు. ఇక్కడి సంప్రదాయాలు నచ్చడంతో ఎన్నో విదేశీ జంటలు మన దేశంలో వారణాసి (Varanasi) లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలవద్ద వివాహబంధంతో ఒక్కటవుతుంటాయి. తాజాగా రూయిజ్ కాబోల్ (Ruiz Cabol), గొంజాలో మిగ్వెల్ (Gonzalo Miguel) జంట సైతం ఇదే ఆలోచనతో మెక్సికో (Mexico) నుంచి వారణాసికి వచ్చింది.
అస్సీ ఘాట్ వద్ద నీటిపై తేలుతున్న పడవలో వేదమంత్రాల నడుమ అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. మెక్సికన్ సంప్రదాయానికి భిన్నంగా విన్నూత రీతిలో ఈ జంట వివాహం జరిగింది. వరుడు ధోవతి, కుర్తా వేసుకుని తలపాగా ధరించగా.. వధువు బనారస్ చీరలో మెరిసిపోయింది. ఆచార్య దీపక్ పాండే పెళ్లి మంత్రాలు చదివారు. దేశ విదేశీ పర్యాటకులు ఘాట్ వద్ద గుమికూడి ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు.
కొత్తజంటపై పలువురు పూలవర్షం కురిపించారు. ఈ అద్భుతమైన క్షణాలు భిన్న సంస్కృతుల సంగమం అంటూ పలువురు ప్రశంసించారు. పర్యాటకులు తమ కెమెరాల్లో ఈ వివాహ వేడుకను చిత్రీకరించారు.