Nirmal | ఉత్కంఠకు తెరపడింది. తెండు ఆకులు సేకరించేందుకు అడవిలోకి (forest) వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళలు సురక్షితంగా ఇంటికి చేరారు. దాదాపు ఆరు గంటల పాటు అడవిని మొత్తం జల్లెడ పట్టిన పోలీసులు చివరికి తప్పిపోయిన మహిళల్ని గుర్తించి శుక్రవారం ఉదయం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటన నిర్మల్ (Nirmal) జిల్లా కప్పనపల్లి (Kappanapalli) గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన నలుగురు మహిళలు రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్టుమేడి లక్ష్మి, బత్తుల సరోజ గురువారం ఉదయం తెండు ఆకుల (Tendu leaves) కోసం సమీపంలోని అడవిలోకి వెళ్లారు. సాయంత్రం అయినా వాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన గ్రామస్థులు వారి కోసం అడవిలో గాలించగా ఎక్కడా వారి జాడ కనపడలేదు. దీంతో వారు చివరికి పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన 50 మంది పోలీసు సిబ్బంది అడవిని మొత్తం జల్లెడపట్టారు. డ్రోన్ కెమెరాలు, సెల్ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ పద్ధతులను ఉపయోగించి ఆరు గంటల పాటూ వారి కోసం తీవ్రంగా గాలించారు. ఏఎస్పీ రాజేష్ మీనా పర్యవేక్షణలో ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగింది. నలుగురు మహిళల్లో ఇద్దరి వద్ద సెల్ఫోన్లు ఉన్నప్పటికీ కనెక్టివిటీ సమస్య కారణంగా ట్రాక్ చేయడం పోలీసు బృందాలకు కష్టతరంగా మారింది. అడవిలోకి వెళ్లిన ఆ మహిళలు దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అటూ ఇటూ తిరుగుతూ ఉండగా.. అర్ధరాత్రి తర్వాత ఓ ఫోన్కు సిగ్నల్ వచ్చింది.
దాని ఆధారంగా పోలీసు బృందాలు ఆ ప్రాతంపై డ్రోన్లను ఎగరవేసి వారి జాడ కోసం వెతికారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తప్పిపోయిన నలుగురు మహిళల జాడను గుర్తించి వారిని సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, శేఖర్, రమేష్, సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా పోలీసు బృందాలు పాల్గొన్నారు. మహిళల్ని సురక్షింగా గ్రామానికి తీసుకొచ్చిన పోలీసు బృందాలను గ్రామస్థులు సత్కరించారు. వారందరికీ గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read..
KTR | అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా ఫూలే: కేటీఆర్
KCR | వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే: కేసీఆర్