హైదరాబాద్: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీనవర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం పాటు పడిన ఫూలే గారి బాట ఆచరణీయమని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఫూలేని సమున్నతంగా గౌరవించిందన్నారు. విదేశీ విద్యను అభ్యసించే వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఫూలే పేరు మీద స్కాలర్షిప్లు అందచేసిందని పేర్కొన్నారు. సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఎక్స్ వేదికగా ఘనంగా నివాళులర్పించారు.