దస్తూరాబాద్ : దస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లె గ్రామంలో రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. దాదాపు 3 గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 41 కిలోల 300 గ్రాముల ధాన్యం తూకం వేస్తున్నారు. రైస్ మిల్లులకు వెళ్లాక ధాన్యం దించుకోవడం లేదని, 43 కిలోల చొప్పున దించుకొంటాం, లేక పోతే దించుకోమని అని రైస్ మిల్ యజమానులు అంటున్నారు అని ఆరోపించారు.
అదనంగా రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు అని వాపోయారు. ప్రతి సంవత్సరం ఒక సంచి 41 కిలోలు మాత్రమే తూకం వేయాలని కానీ అదనంగా ఒక కిలో తూకం వేసి రైస్ మిల్లులకు పంపిస్తున్నాం అని తెలిపారు. ఒక క్వింటాలుకు 7 కిలోల వడ్లు అదనంగా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక లారీలో 800 బస్తాలకు 40 క్వింటాల నష్టం జరుగా, దాదాపు 90 వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారు అని ఆరోపించారు.
అధికారులు వెంటనే రైస్ మిల్లర్ల యజమానులపై చర్యలు తీసుకొని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసులు శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు.ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు నివేదిస్తామని సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో డిటి యాదవ రావు, ఎస్ఐ కృష్ణా రెడ్డి, రెవెన్యూ సిబ్బంది సంతోష్, రచన, రైతులు ఉన్నారు.