కుభీర్, మార్చ్ 31: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోమవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. కుభీర్ తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలతోపాటు కూరగాయ పంటలు దెబ్బతినండంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి.. కష్టపడి పండించిన పంటలు కండ్ల ముందే నేల వాలడంతో మండల రైతాంగం లబోదిబో మంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో గోడ్సరా, గోడపూర్, సాంగ్వి గ్రామాలలో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
నిగ్వా, పల్సి, పార్డి కె, పార్డి బీ, దొడర్ణ, దాని అనుబంధ తండాలు, సిరిపెల్లి గిరిజన తండాలు, బెల్గాం, చాత, కుప్టి, వర్ని, మలేగాం, సోనారి, గోడాపూర్, గోడ్సేరా, సాంగ్వి, సిరిపెల్లి హెచ్ తదితర గ్రామాల్లో గాలి వర్ష తీవ్రతకు చేతికి వచ్చిన పంటలు నేల రాలిపోయాయి. అకాల వర్షానికి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇంత జరిగినా ఏ గ్రామానికి ఇంతవరకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు వెళ్లి ఫీల్డ్ విజిట్ చేయకపోవడం పట్ల ఆయా గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12:00 దాటుతున్న క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించక పోవడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయిన పంట వివరాల నివేదికలు తయారుచేసి జిల్లా అధికారులకు అందించి పరిహారం అందించాలని మండల రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారిణి సారికను వివరణ కోరగా చాలా గ్రామాలలో జొన్న, మొక్కజొన్న పంటలు గాలులకు నేలవాలి నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. మండలంలోని ఏఈఓ లను ఫీల్డ్ విజిట్ చేసి నివేదికను పంపమని చెప్పామని సాయంత్రం వరకు ప్రాథమిక అంచనా రిపోర్టును ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.