ఖానాపూర్ రూరల్: సర్కార్ బడికి ఓ కాంట్రాక్టర్ తాళం వేశాడు. తనకు రావాల్సిన రూ.40 లక్షలు ఇచ్చేవరకు తాళం తీసేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక వారంతా బయటే ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురలో చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో భాగంగా రూ.40 పెట్టుబడి పెట్టి పాఠశాల పూర్తి మరమ్మతులు చేయించానని, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించానని సదరు కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలయ్యానని తెలిపారు. ఉన్న ఆస్తులను, ఎడ్లు, ట్రాక్టర్లు, అమ్ముకుని ఆ బాకీలు కట్టానని.. ఇంకా కట్టాల్సిన అప్పులు అలాగే ఉన్నాయని చెప్పారు. అప్పులు ఇచ్చిన వాళ్లు వేధిస్తున్నారని.. వెంటనే బిల్లులు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలకు తాళం వేశానని.. ఇప్పటికీ నా బిల్లులు చెల్లించకపోతే, ఇక్కడే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.