కడెం : రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ కోరారు. శుక్రవారం ఆమె శాసనసభ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ఖానాపూర్ నియోజకవర్గంలో 93 గ్రామ పంచాయతీల నుంచి 243 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. తండాలను, గూడెలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజలకు పాలనపరమైన ఇబ్బందులు తీర్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అయితే నూతన పంచాయతీలకు భవనాలు లేక కొన్ని పంచాయతీల్లో ఇళ్లలోనే గ్రామ పంచాయతీలను ఏర్పాటు జరిగిందని వెల్లడించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని పంచాయతీలు కూలిపోయాయని తెలిపారు. స్పందించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రతిపాదన ఉందని, త్వరలోనే వాటి నిర్మాణాల విషయమై పరిశీలించి పక్క భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.