ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మావలలో జరిగిన కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని బీసీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకుడు లక్ష్మణ్ అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు జోగు రామన్న తెలిపారు.
దేశంలో 56 శాతం బీసీ జనాభా ఉన్నా, వారి అభివృద్ధిని చూడడానికి కేంద్రం ప్రభుత్వంలో మంత్రి లేడని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.5200 కోట్లు కేటాయిస్తే, మోదీ ప్రభుత్వం కేవలం రూ.1200 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుకావడం లేదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.