రెబ్బెన, జూన్ 3 : సింగరేణిలో అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలు సుమారు 400 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం గోలేటి సీహెచ్పీలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి గోలేటి హెడ్వోడి కోటయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏఐటియుసి, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నమ్మించి మోసం చేసిందని అన్నారు. కేసీఆర్ హయాంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించి వెనువెంటనే ఉద్యోగాలు అందించామని గుర్తు చేశారు.
గత సంవత్సరం కాలంగా మెడికల్ మెడికల్ బోర్డులను నిలుపుదల చేసి కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. వెంటనే కారుణ్య ఉద్యోగాలు ఇవ్వకుంటే లేనిపక్షంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ నాయకులు ఆర్ శ్రీనివాస్, ఏరియా నాయకులు విద్యాసాగర్, మురళి, అజాజ్, ఆకుల శ్రీనివాస్, చిరంజీవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.