తాండూర్ : ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి. ఆ రెండు సంఘాల ఆధ్వర్యంలో 49 జీవో రద్దు కోసం మంగళవారం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఆదివాసీ గిరిజనులు బురుదలో నిలబడి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల జీవితాలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికి టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ గూడేలను కాళీ చేయిస్తున్నారని చెప్పారు. పులుల సంరక్షణ పేరుతో కొమురం భీం జిల్లాలో ఆదివాసులను అడవి నుంచి గెంటివేసి, అడవిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తడోబా అంధేరి రిజర్వ్ ఫారెస్టును కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో కలుపుతూ కొమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్- ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను పేర్కొంటూ తీసుకొచ్చిన జీవో నెం.49 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఉందని అన్నారు. అసిఫాబాద్ జిల్లాలో గ్రామసభ, పెసా లాంటి గిరిజన చట్టాలను అమలు పర్చకుండా ఈ గ్రామాల్లో ఎలాంటి సభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయలు తీసుకోకుండా జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేటని అన్నారు. పులుల సంరక్షణ, అడవుల సంరక్షణ పేరుతో అడవిని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి అదివాసీలను అడవులకు దూరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా ప్రభుత్వం నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, త్రీ ఫేస్ కరెంటు, ఇతర సదుపాయాలన్నింటిని ఫారెస్ట్ అధికారులు ఆపేశారని అవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములకు సర్వే హక్కు పత్రాలు ఇవ్వాలని, ఆదివాసీ గ్రామల్లో బ్రిడ్జిలు, రోడ్లు, కాలువల నిర్మాణం చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఏజీఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంఘాల నాయకులు ఆత్రం బాదిరావు, సోయం ప్రభాకర్, కుర్సింగ దిందర్ సావ్, కొమురం జంగు, కోట్నాక శ్యామ్ రావ్, అత్రం భీంరావ్, కోట్నాక బొజ్జిరావ్ తదితరులు పాల్గొన్నారు.