కాసిపేట, నవంబర్ 25: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తహసీల్దార్ కార్యాలయ పలువురి సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాసిపేట మండల కేంద్రానికి చెందిన పోలవేణి తిరుపతి అనే వ్యక్తి కాసిపేట శివారులోని పలు సర్వే నెంబర్లు పహాని నకలు రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గత సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, ఎన్ని సార్లు తిరిగినా రేపు, మాపు అంటూ తింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు రికార్డు పహానీల నకలు రికార్డులు అందించాలని బాధితుడు కోరారు.
మధ్యవర్తి ఉంటే పని త్వరగా..
ఇటీవల కాలంలో కాసిపేట తహసీల్దార్ కార్యాలయంలో పలువురు సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులు, రైతులు తహసీల్ కార్యాలయానికి వెళ్లాలంటేనే జంకుతున్నారనే విమర్శలున్నాయి. పనులు కోసం వెళ్తే కావాలని ఆలస్యం చేయడం, తిరిగి తిరిగి పని కాక విసిగి చెందిన తర్వాత ఎవరినో ఒకరిని మధ్య వర్తిని పట్టుకొని వస్తే త్వరగా పని చేస్తున్నారనే విమర్శలున్నాయి. త్వరగా కావాలంటే అక్కడి సిబ్బంది కొంత మంది మద్య వర్తులతో డీల్ పెట్టుకున్నానే విమర్శలున్నాయి.
ఏ పని కావాలన్నా మధ్యవర్తులతో కలిసి తహసీల్ కార్యాలయాల్లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని, అప్పుడే పనులు త్వరగా అవుతున్నాయి. వారి చెప్పిన వాటికి ఓకే అంటేనే పనులు సాఫీగా జరుగుతున్నాయని, లేదంటే ఏదో రకంగా కొర్రీలు పెట్టి పనులు ఆపేస్తున్నారని, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై తహసీల్దార్ సునీల్ కుమార్ను కార్యాలయ సిబ్బంది తీరుపై వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని, పనులు ఆగడం లేదని, ఏదైనా సమస్య ఉంటే విచారణ చేసి తెలుసుకొని చర్యలు తీసుకుంటానన్నారు.