కాసిపేట, డిసెంబర్ 8 : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, దానిని సరైన పద్ధతిలో వాడుకోవాలని ఒక్కరు ఒక్కో పద్ధతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలో మాకు నచ్చిన వారికి స్వచ్ఛందంగా ఓట్లు వేస్తామని, మా ఓట్లు అమ్మబడవని ఇంటి ముందు బోర్డులు పెట్టారు. సోమగూడెంకు చెందిన ఓం సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ సిరిపోతుల కుమార్ తన ఇంటి ముందు మా ఓట్లు డబ్బులకు, మందుకు, వస్తువులకు అమ్మబడవని, మాకు నచ్చిన వారికి ఓట్లు వేస్తామని, ఇబ్బందులు పెట్టద్దని ఇంటి ముందు బోర్డు పెట్టారు.
ఎవరూ కూడా ఇబ్బందులు పెట్టవద్దని, ఎటువంటి ప్రలోబాలకు లొంగకుండా స్వచ్చందంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇలా ఇంటి ముందు బోర్డులు పెట్టామని సదురు ఉపాధ్యాయులు సిరిపోతుల కుమార్ తెలిపారు. ఎవరూ కూడా ప్రలోబాలకు లొంగకూడదని అనే సంకల్పమని తెలిపారు. కుమార్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆలోచింపజేసింది.