తాండూర్, జూన్ 25: సింగరేణి కాలరీస్లోని మాదారం టౌన్షిప్లోని శిథిల క్వార్టర్లు కూల్చివేత ప్రారంభమైంది. నిరూపయోగంగా పడున్నశిథిల భవనాలను కూల్చి ఆ స్థలాన్ని వినియోగంలోకి తేవాలని అధికారులకు చేసిన సూచనల మేరకు అధికారులు స్పందించారు. మెయిన్ రోడ్డు చెంతనే ఉన్న శిథిల క్వార్టర్లను కూల్చివేసి.. ఆ ప్రాంతాన్ని చదును చేసే పనులను శనివారం ప్రారంబించారు. దాదాపు 30 క్వార్టర్లు కూల్చివేసినట్లు సింగరేణి సివిల్, ఎస్టేట్ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మిగతా శిథిల క్వార్టర్లు కూడా కూల్చివేత పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.
శిథిల సింగరేణి క్వార్టర్ల కూల్చివేతలు ప్రారంచించడంతో క్వార్టర్లతో అనుబంధం కలిగిన కార్మిక కుటుంబాలు ఐదు దశాబ్ధాల కాలంలో స్మృతులను గుర్తు చేసుకున్నారు. మాదారం ఓపెన్ కాస్ట్ అవుతుందనే ప్రచారంతో ఈ కూల్చివేతలు ప్రాధాన్యం సంచరించుకున్నాయి. కూల్చివేతలు కేవలం ఈ ప్రాంతానికే పరిమితం చేస్తారా..? కార్మికులు లేని మిగతా ప్రాంతాలలో కూడా కూల్చివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
ఐదు దశాబ్దాల క్రితం సింగరేణి కాలరీస్ సంస్థ మాదారం టౌన్షిప్ కి పురుడుపోసింది. సింగరేణి యజమాన్యం కార్మికుల కుటుంబాల నివాసాల కోసం వందలాది క్వార్టర్లు, మాదారం పోలీస్ స్టేషన్, సీఈఆర్ క్లబ్, డిస్పెన్సరీతో పాటు పలు కార్యాయాల భవనాలు నిర్మించింది. ఐదు దశాబ్ధాల పాటు వందలాది కార్మిక కుటుంబాలతో మాదారం టౌన్షిప్ కళకళలాడింది. అయితే కాలక్రమేణా బొగ్గుగనులు ఒక్కొక్కటిగా మూతపడటం, కార్మికులు ఇతర ఏరియాలకు బదిలీ కావడం, ఉద్యోగ విరమణలు చేయడం లాంటి కారణాలతో కార్మికులలు క్వార్టర్లలో నివాసాలు లేక క్రమేపీ అవి శిధిలావస్థకు చేరాయి. ప్రత్యేకించి మాదారం టౌన్షిప్ గుట్ట కింద క్వార్టర్లు నివాసయోగ్యంగా లేకపోవడం, ఖాళీగా ఉంటుండంతో ఆ క్వార్టర్లు తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకెళ్లడంతో ఆ ప్రాంతం ఆసాంఘిక కార్యాకలపాలకు అడ్డాలుగా మారాయి. దాంతో, వాటిని కూల్చివేసే పనుల్ని వేగవంతం చేశారు అధికారులు.