
మంచిర్యాల అర్బన్ : నాలుగు రోజుల పసికందు… శ్వాస సరిగ్గా ఆడటం లేదు. ఫిట్స్ వచ్చింది.. వైద్యం కోసం వచ్చారు. చేతిలో డబ్బు లేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. విషయం తెలుసుకున్న సఖి సిబ్బంది స్పందించారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా సంక్షేమాధికారి, అధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. ఆ చిన్నారి ప్రాణం నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని సిర్వంచ జిల్లా బెజ్జూరుపల్లికి చెందిన సోని, మల్లేశ్ దంపతులకు పాప పుట్టింది. పాపకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంచిర్యాలకు తీసుకువచ్చారు. ఇక్కడికి వచ్చాక పాప పరిస్థితి మరింత విషమంగా మారింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకాగా, ఫిట్స్ కూడా రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు ఐబీ ఏరియాలో పాపను పట్టుకుని ఉండిపోయారు.

చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సఖి సిబ్బంది వారిని గమనించి ఆసుపత్రికి తరలించారు. పాపకు ఆక్సిజన్‌తో పాటు చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆరు రోజులుగా ఆ చిన్నారికి వైద్యం అందించేందుకు జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి, సఖి సెంటర్ సీఏ శ్రీలత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ సైతం ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చిన్నారికి చికిత్స అందించడంతో పాటు పాప తల్లి సోని సైతం బలహీనంగా ఉండటంతో ఆమెకు సైతం రక్తం ఎక్కించారు. తమ కేంద్రంలోనే ఉంచుకుని ఆ తల్లిని సంరక్షించారు.
సమయానికి స్పందించిన సఖి సిబ్బంది శైలజ, ప్రసన్న లక్ష్మీ, జిల్లా సంక్షేమాధికారి ప్రసన్న లక్ష్మిని పలువురు అభినందిస్తున్నారు. విషయం తెలుసుకున్న చాలా మంది దాతలు సైతం చిన్నారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. దీంతో వారి వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. ఆదివాసీ ఉద్యోగులు మడావి శంకర్, ప్రసన్నలక్ష్మి, క్రాంతికుమార్, భారిక్రావు, శేఖర్ రూ. 18,200 అందచేయగా, మరి కొంతమంది ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు.