బెల్లంపల్లి: రక్తాన్ని కృతిమంగా తయారు చేయలేమని, ఒకరి ద్వారా మాత్రమే సేకరించగలమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ అన్నారు. అందుకే దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెల్లంపల్లి బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన (Blood Donation) శిబిరాన్ని నిర్వహించారు. రాజ యోగిని దాది ప్రకాష్ మణీజీ 18వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించడంలో భాగంగా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రక్తనిధి కేంద్రం ఇన్చార్జ్ వీ.మధుసూదన్ రెడ్డితో కలిసి సబ్ కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానంతో గతంలో తాను లబ్ధి పొందానని, రక్తదానం ప్రాముఖ్యత తనకు తెలుసన్నారు. రక్తదానంపై కొంతమందికి ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. అన్ని దానాలకంటే రక్తదానం చాలా గొప్పదని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బ్రహ్మ కుమారీస్ సంస్థ, రెడ్ క్రాస్ సొసైటిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకులు బికే పద్మ, బి కే కైవల్య, వైద్యులు మధుకర్ నాయక్, జుబేర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బాధ్యులు కాసర్ల శ్రీనివాస్, సూపర్వైజర్ విజయ, సిబ్బంది రజిత, సురేష్, హరీష్, లయన్ సభ్యులు ఎర్ర సువర్ణ తదితరులు పాల్గొన్నారు.