తాండూర్, జూలై 26: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డును (Road) గత సంవత్సరం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రోడ్డు పనులు చేపట్టకుండా కేవలం అచ్చలాపూర్ వద్ద ఒక కల్వర్టు మాత్రమే నిర్మించారు. ఈ కల్వర్టు పనులు కూడా ఇష్టారాజ్యంగా చేయడంతో ఇప్పుడు అసలు పంటల సీజన్లో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కల్వర్టు నిర్మాణం కోసం తోడిన మట్టిని కల్వర్టు లోనే వేయడంతో వరద కాలువ మూసుకుపోయింది. దీంతో నీళ్లు వెనక పొలాల్లోకి వెళ్తున్నాయి. పైన కూడా గట్టి మొరం వేయకుండా తీసిన మట్టితోనే నింపడంతో మోకాళ్ల లోతు బురద తయారైంది. పక్కనున్న పొలాల గట్లు కూడా తీసి మళ్లీ పునరుద్ధరించక పోవడంతో రైతులే మళ్లీ సొంత ఖర్చులతో పనులు చేయించుకుంటున్నారు.