Kasipeta | కాసిపేట, డిసెంబర్ 6 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో రెండో దశ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రంతో నామినేషన్ ఉప సంహరణ గడువు ముగిసింది. దాంతో అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను అధికారులు కేటాయించారు. మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీల సర్పంచ్, 22 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 190 వార్డుల్లో నామినేషన్లను అధికారులు స్వీకరించగా.. ఒక ధర్మారావుపేట సర్పంచ్ స్థానంతో పాటు 48 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 29 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 21 మంది ఆయా వార్డులకు సంబంధించి అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మిగితా 21 సర్పంచ్ స్థానాల్లో 64 మంది, 133 వార్డుల్లో 349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతరం అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.. 2 గంటలకు కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.